Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాళేశ్వరం తెలంగాణాకి వరమా లేక శాపమా…?

Category : editorial politics

తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఆంధ్రా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సాక్షిగా కెసిఆర్ ఘనంగా ప్రారంభించారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం గోదావరిమాతకు పూజలు చేసి… జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌ జగన్‌, ఫడణవీస్‌ హాజరయ్యారు. కన్నేపల్లి పంప్‌హౌస్‌ను గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించగా, శిలాఫలకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పంప్‌హౌస్‌ ప్రత్యేకతను గవర్నర్‌, జగన్‌కు కేసీఆర్‌ వివరించారు. కన్నేపల్లె వెళ్తూ మార్గ మధ్యలో కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయాన్ని వీరు సందర్శించారు.

మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెంటరీని గవర్నర్‌, సీఎంలు కేసీఆర్‌, పడణవీస్‌, జగన్‌ వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెరాస ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. పట్టణాలు, గ్రామాల్లో బాణసంచా పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్నొక పండగలా జరపాలని ప్రభుత్వం నుంచి అనధికార ఆజ్ఞలు ఉండటంతో ప్రతి శాసన సభ్యుడు తమ తమ నియోజకవర్గాల్లో ప్రతి ఊరిలోనూ దీన్ని ఒక భారీ పండగలా నిర్వహించారు.పార్లమెంట్ లో ఎంపీలు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ మొత్తం కెసిఆర్ కే దక్కుతుందని ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మించడం అనేది ఒక చరిత్రని వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కీలక చర్చలు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ లో వాస్తవంగా పూర్తయింది… కొంత వరకు మాత్రమే… కింది చిత్రంలో ఉన్న చక్రం వరకే ఇది పూర్తయింది. ఇప్పటి వరకూ ఖర్చు 40,000 కోట్లు. నీటి నిల్వ 30 TMC. మొత్తం ఖర్చు 80,000 కోట్లు అయితే మొత్తం నీటి నిల్వ 130 నుంచి 141 టీఎంసిలు. ఇప్పటి వరకు కట్టడ౦ మొదలుపెట్టి మూడు సంవత్సరాలు దాటింది. నిర్వహణ వ్యయం ఏడాదికి 8,000 నుంచి దాదాపు 10,000 కోట్లుగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం 130 TMC ల నీటిని 10,000 కోట్లతో కొనుక్కుంటున్నట్లు లెక్క. ఇక ప్రాజెక్ట్ నిర్మాణ ఖర్చు అదనం. ప్రధానంగా నీటిని ఎగువకు పంప్ చేయడం కోసం ఏటా 5,000 మెగావాట్ల విద్యుత్ అవసరం. యూనిట్ కు 4 రూపాయలు వేసుకున్నా గంటకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అంటే నెలకి 1400 వందల కోట్లు ఖర్చు అవుతుంది.

ఖర్చులు పక్కన పెట్టి నీళ్ల గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్ట్ సామర్థ్యము 195టీఎంసీలు.ప్రాజెక్టు ద్వారా కొత్తగా వచ్చే ఆయకట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం 36లక్షల ఎకరాలు.అయితే ప్రాజెక్టు ప్రారంభంలో చెప్పిన లెక్క 16లక్షల ఎకరాలు. మరి మధ్యలో 20లక్షల ఎకరాలు ఎలా పెరిగింది అన్నదానికి ప్రభుత్వం దగ్గర నుండి సమాధానం లేదు. అయితే శ్రీకృష్ణ కమిటీకి నీటిపారుదల రంగ నిపుణులతో(విద్యాసాగర్ రావు గారు సహా) కలిసి కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో ఒక టీఎంసీ నీటికి పదివేల ఎకరాలు మాత్రమే పంట పండుతుంది.195టీఎంసీల ఎత్తిపోసే నీటిలోనుండి తాగునీటి, పరిశ్రమల అవసరాలకు 56టీఎంసీల నీళ్లు పోను 139 టీఎంసీల నీళ్లు సాగుకు ఉపయోగిస్తారు.అంటే ఈ నీటితో దాదాపు 14లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది.మరి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఎంతవరకు నిజం అన్నదానికి తెరాస ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

Related News