//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి అస్తమయం

Category : editorial

 సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత, కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సింగిరెడ్డి సి నారాయణరెడ్డి ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉదయం 8 గంటల సమయంతో తుదిశ్వాస విడిచారు. 

నారాయణరెడ్డి 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో జన్మించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను సినారెకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. రాజ్యసభ  సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. 

 హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. తొలుత సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి,  అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. 

విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే. ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. 

విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సీనారే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవిత రాశారు. పలు విదేశాలలో పర్యటనలు జరిపారు. 

Related News