టెలికాం రంగంలో 'జియో' బ్రాండ్‌తో పెను వ్యాపార ప్రకంపనలకు తెర తీసిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ మరో సరికొత్త సంచనానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఆ సంస్థ దేశ వ్యాప్తంగా 'ఫైబర్-టు-ది-హోమ్' (ఎఫ్టీటీహెచ్) బ్రాడ్‌బ్యాండ్ సేవలను 'జియో ఫైబర్' పేరుతో అందుబాటులోకి తేనుంది. జియో ఫైబర్‌లో భాగంగా సెకనుకు 100 ఎంబీ మెరుపు వేగంతో రిలయన్స్ నెలకు దాదాపు 100 జీబీ డేటాను అందించనున్నట్టుగా సమాచారం. టెలికాం సేవల మాదిరిగానే జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా సంస్థ కాంప్లిమెంటరీ ప్రాతిపదికన 90 రోజుల ఉచితంగానే అందించే అవకాశం ఉన్నట్టుగా జాతీయ మీడియాలో వార్తలు చెబుతున్నాయి. 100 జీబీ పరిధి దాటిన తరవాత వాడకం దారుకు 1 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, పుణె, చెన్నై ప్రాంతాల్లో ప్రయోగాత్మక ప్రాతిపదికన జియో ఫైబర్ సేవలు ప్రారంభ మయ్యాయి.రిలయన్స్ ఎప్పటి నుంచి జియో ఫైబర్ సేవలను అందుబాటులోకి తేనుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రారంభంలో జియో ఫైబర్ సేవలు ఉచితమే అయినప్పటికీ, వాడకందారు ఇన్స్టాలేషన్ చార్జీల కింద దాదాపు రూ.4500ల రిఫండబుల్ డిపాజిట్‌ను సంస్థకు చెలించాల్సి ఉంటుంది. జియో ఫైబర్ సేవలను వద్దనుకున్నప్పుడు సంస్థ ఆ మొత్తాన్ని వినియోగదారుకు తిరిగి చెల్లించేస్తుందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.