మరి కొద్ది రోజుల్లో తన పెళ్లి జరగాల్సి ఉండగా తనకి కాబోయే భర్తకి ఓ యువకుడు వార్నింగ్ ఇవ్వగా... వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే జిల్లాలోని అశ్వారావుపేట మండలం వడ్డెర రంగాపురం గ్రామానికి చెందిన ఏడుకొండలు, నాగరత్నం కూతురు సంతోషి కుమారికి నెల రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. సంక్రాంతి పండుగ తర్వాత వీరి వివాహానికి పెద్దలు ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి ఆ అమ్మాయి.. నేనూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామని.. తనని నువ్వెలా పెళ్లిచేసుకుంటావ్..? అంటూ హెచ్చరించాడు.
వివాహానికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఇలా ఓ యవకుడు వచ్చి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని పెళ్లి కొడుకు... కాబోయే అత్తమామలకి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంతోషి కుమారి బుధవారం ఉదయం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆమె మృతి చెందింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శంకరరావు తెలిపారు.