Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అనంతలో అప్పుడే ఎన్నికల సందడి ... చీరల రాజకీయం చేస్తున్న జేసీ బ్రదర్స్

Category : state politics

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. అనంతపురం జిల్లాలో ఎన్నికల సందడి తారా స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటి నుండే ఓటర్లను ఆకట్టుకోవటం కోసం రాజకీయ నాయకులు జిల్లాలో నానా పాట్లు పడుతున్నారు. దీంతో ఇప్పుడు అక్కడ ప్రజల్లో కూడా సందడి నెలకొంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టి ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు అనంత ఎమ్మెల్యేలు . ఇక రాజకీయాల్లో జీసీ బ్రదర్స్ డి వినూత్నమైన శైలి. అలాంటి జేసీ బ్రదర్స్ ప్రజలకు చేరువ కావటానికి చీరల రాజకీయం చేస్తున్నారు. అర్ధం కాలేదా ... అయితే ఈ స్టొరీ పై ఓ లుక్కెయ్యండి.

అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి ప్రజలకు దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాము బరిలోకి దిగబోము అని చెప్పినా, వారసుల రాజకీయ రంగ ప్రవేశం సాఫీగా జరిగేలా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సూరి చీరాల పంపిణితో ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక ఇది తాడిపత్రికి కూడా పాకినట్టు తెలుస్తుంది. నియోజకవర్గంలో దాదాపు 88 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు జేసి సోదరులు. యాడికి మార్కెట్ యార్డులో పదివేల మంది మహిళలకు స్పర్శ స్వచ్ఛంద సంస్థ ద్వారా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పసుపు,కుంకుమ కింద చీరలు పంపిణీచేశారు. ఇక అక్కడికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలకి మందు, విందు అదనంగా ఏర్పాటు చేశారు.ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడిన మహిళలకు కాస్త నగదు కూడా ఇచ్చారట.

మహిళల ఓటు బ్యాంకు గురించి తెలిసిన జేసి కుటుంబం వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యతను ఇస్తూ రాజకీయం చేస్తుంది. ఇక జేసీ బ్రదర్స్ పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, తాడిపత్రి, రూరల్ మండలాల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. ఇక ఇదే సమయంలో కుమారులను కూడా ప్రమోట్ చేస్తున్నారు జేసి సోదరులు. తమ వారసులు అస్మిత్, పవన్‌లను ఆశీర్వదించాలని మహిళలను కోరుతున్నారట. మహిళా శక్తి అండగా ఉంటే రాజకీయాల్లో తిరుగుండదని ఇప్పటికే పలుమార్లు రుజువైన సందర్భంగా వీరు కూడా మహిళలని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చూద్దాం మరి వీరి చీరల రాజకీయం ఏ మేరకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందో.