ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన ఐపీఎల్ వేలంలో అందరినీ ఆకర్షించిందో 17 ఏళ్ల అమ్మాయి. బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు కనిపించిన ఆ అమ్మాయి గురించే ఇప్పుడు చర్చంతా.
వేలంలో చురుగ్గా కనిపించిన ఆ అమ్మాయి పేరు జాన్వి మెహతా. కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని, వ్యాపారవేత్త జే మెహతా, నటి జుహీచావ్లా గారాల పట్టి. ఐపీఎల్ వేలంలో కూర్చున్న అతి పిన్న వయస్కురాలు. లండన్‌లో చదువుకుంటున్న జాన్వి ఇటీవలే భారత్ వచ్చింది. తల్లితో కలిసి వేలంలో పాల్గొని అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. వేలంలో చురుగ్గా వ్యవహరించి ఆటగాళ్ల కొనుగోళ్లలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి శభాష్ అనిపించుకుంది.
కేకేఆర్ ఫ్రాంచైజీ వ్యూహరచనలోనూ పాలుపంచుకుంటున్న ఝాన్వీ ఆటగాళ్ల బిడ్డింగ్‌లోనూ చురుగ్గా పాల్గొని.. స్పెషల్ ఆట్రాక్షన్‌గా నిలిచింది. సహజంగా రిటైర్డ్ క్రికెట్ దిగ్గజాలు పాల్గొనే ఈ వేలంపాటలో ఈ యంగ్‌స్టర్స్ పాల్గొనడం ఆసక్తి రేకెత్తించింది.
జాన్వికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఐపీఎల్ వేలంలో తమతోపాటు పాల్గొనడం ఆమెకు, తమకు గొప్ప అనుభూతిని మిగిలిచ్చిందని జే మెహతా అన్నారు. ఇంగ్లండ్‌లో చదువుకుంటున్న జాన్వి మూడు రోజుల క్రితమే భారత్ వచ్చినట్టు తెలిపారు. ఐపీఎల్ వీడియోలో జాన్వి మాట్లాడుతూ క్రిస్‌లిన్‌ను సొంతం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొంది.