Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విశాఖ అభ్యర్థులపై జనసేన కసరత్తు .. 26న జనసేన తొలి జాబితా

Category : state politics

అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తుంటే జనసేన పరిస్థితి ఏంటి అని అందరూ భావించారు. జనసేన కు అభ్యర్థులు లేరా అని మాట్లాడుతున్న వారు లేకపోలేదు. అందుకే జనసేన ముందు తనకు బలం ఉన్న చోట అభ్యర్థులను ప్రతించాలని భావిస్తోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుంటే జనసేన పార్టీ తన అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా ప్రకటించాలని చూస్తోంది. ఇప్పటికే ప్రాధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే జనసేనాని కూడా అభ్యర్థుల వేటలో పడ్డారు. జనసేనాని తమ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 26న విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఇక ఈ జాబితాలో ప్రధానంగా జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలోని నాయకుల పేర్లు ప్రధానంగా ప్రకటించే అవకాశం వుంది.

ఇక విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజక వర్గాలు వుండగా అందులో కనీసం నాలుగైదు స్థానాలకైనా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది .విశాఖ తూర్పు నియోజకవర్గంలో చిరంజీవి అభిమానుల సంఘం నాయకుడు ఎం.రాఘవరావు చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలోను కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి అక్కడ పోటీ ఎవరూ లేరు. అయితే కొత్తగా ఎవరైనా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి బొలిశెట్టి సత్య, గేదెల శ్రీనుబాబు పోటీ పడుతున్నారు. విశాఖ పశ్చిమ టిక్కెట్‌ డాక్టర్‌ సుసునీత , పీవీ సురేశ్‌ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలీటం లేదు. విశాఖ ఉత్తరం నుంచి గుంటూరు భారతి, పసుపులేటి ఉషాకిరణ్‌ రంగంలో ఉన్నారు. వీరు కాకుండా కాపునేత ముద్రగడ పద్మనాభం శిష్యుడు తోట రాజీవ్‌ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీరిలో టికెట్ ఎవరికి ఇస్తారో అన్న టెన్షన్ వుంది . ఇక ఈ సెగ్మెంట్ లోనే ఎక్కువ పోటీ ఉంది.విశాఖ దక్షిణ నియోజక వర్గం నుంచి వైసీపీ నుంచి వచ్చిన గంపల గిరిధర్‌, రాహుల్‌ టిక్కెట్లు ఆశిస్తున్నారు. భీమిలి నుంచి విద్యాసంస్థల అధినేత అలివర్‌ రాయ్‌తో పాటు ముత్తంశెట్టి కృష్ణారావు పేరు వినిపిస్తోంది. ఇక వీరిరువురిలో పవన్ ఎవరికి అవకాశం ఇస్తారో మరి. పెందుర్తి నుంచి ప్రస్తుతానికి మండవ రవికుమార్‌ ఉన్నారు. ఇంకా మరికొందరు పార్టీలోకి వచ్చే అవకాశం వుందని, అభ్యర్థి ప్రకటనకు కొంత సమయం పడుతుందని తెలుస్తోంది .

గాజువాకకు మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, కోన తాతారావు, తిప్పల రమణారెడ్డి ఉన్నారు. వీరిలో చింతలపూడి పేరు బాగా వినిపిస్తోంది. మరి పవన్ చింతలపూడికి అవకాశం ఇస్తారో లేదో . అనకా పల్లి ఎంపీ స్థానానికి కూడా ముత్తంశెట్టి కృష్ణారావు పేరు పరిశీలనలో ఉంది. అసెంబ్లీ నియోజకవర్గానికి సీతారామ్‌ పేరు వినిపిస్తోంది. అయితే సీనియర్‌ నేత దాడి వీరభద్రరావును స్వయంగా పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కాబట్టి ఆయన పార్టీ లో చేరితే ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం వుంది. ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా ఆయన నిర్ణయంపైనే అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపు ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా టికెట్ ఇప్పుడే కేటాయించే పరిస్థితి లేదు. ఇక నర్సీపట్నం నుంచి గతంలో మాజీ ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాప పేరు వినిపించింది. ఇప్పుడు కొత్తవారు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది . చోడవరం నుంచి పీవీఎస్‌ఎన్‌ రాజు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఇంకెవరూ పోటీ లేరు. కాబట్టి ఆయన ఒక్కరి పేరే పరిశీలనలో ఉంది . ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, మాడుగులకు పూడి మంగపతిరావుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అక్కడ ఎవరికి సీటు దక్కుతుందో తెలీదు. పాయకరావుపేటకు నక్కా రాజారావు, శివదత్తుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఏజెన్సీలో మాజీ మంత్రి బాలరాజు అరకు పార్లమెంటుకు గానీ, పాడేరు అసెంబ్లీకి గాని పోటీ చేయాలని భావిస్తున్నారు. అరకు అసెంబ్లీ నియోజక వర్గానికి గంగులయ్య ప్రయత్నిస్తున్నారు. ఇలా మొత్తానికి విశాఖ జిల్లాలో జనసేన అభ్యర్థుల ప్రకటన తోలి జాబితాలో ఒక నాలుగు ,ఐదు స్థానాల్లోనే ఉండేట్టు వుంది.

Related News