మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు సిరీస్ ను కైవసం చేసున్నా లంకతో జరిగిన రెండో టెస్టులో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు పడటంతో టీమిండియా షాక్ కు గురయింది. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. దీంతో పల్లెకెలె జరగనున్న మూడో టెస్టుకు అతడు దూరం కావలసిందే. 24 నెలల వ్యవధిలో జడేజా 6 అపరాధ (డీమెరిట్) పాయింట్లు తెచ్చుకోవడంతో ఐసీసీ నియమ నిబంధనల ప్రకారం అతడిపై చర్య తీసుకున్నారు.
రెండోఇన్నింగ్స్ లో శ్రీలంకను 386 పరుగుల వద్ద ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్ ను ఇంకా టెస్టు మ్యాచ్ మిగిలిఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్(110బీ135 బంతుల్లో17 ఫోర్లు), దిముత్ కరుణరత్నే(141బీ 307 బంతుల్లో 16 ఫోర్లు)లు మినహా ఎవరూ రాణించలేదు. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, అశ్విన్ రెండు వికెట్లు సాదించాడు. ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లో జడేజా శనివారం నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. మూడో రోజు ఆటలో 58వ ఓవర్లో చివరి బంతి వేసిన జడేజా తన చేతిలోకి వచ్చిన బాల్‌ను బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నే వైపు విసిరాడు. అతడు క్రీజ్ వదలనప్పటికీ ప్రమాదకరంగా బంతిని విసిరినట్టు ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. తాజా ఉల్లంఘనతో అతడు 6 అపరాధ పాయింట్లు తెచ్చుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించించారు. అప్పుడు అతడికి 3 డీమెరిట్ పాయింట్లు వచ్చాయి.