నిన్నటి వరకు అందమైన రంగురంగుల జీవితానికి మారుపేరుగా మారిన ఐటి ఇప్పుడు గుదిబండగా మారనున్నది. ప్రస్తుతం ఐటీ సంస్థల్లోని చాలా విభాగాల్లో మానవ వనరుల అవసరం తగ్గుతూ వస్తున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్ టెక్నాలజీల సాయంతో చాలావరకు కార్యకలపాలను ఆటోమేట్ చేయడం ఇందుకు కారణం.
ఇందుకుతోడు హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అమెరికాలో కార్యకలాపాలకు స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దేశీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చివేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ ఐటీ సంస్థలు ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల చొప్పున ఉద్యోగులను తొలిగించవచ్చని హెడ్ హంటర్స్ అనే సంస్థ అంచనా వేస్తున్నది. కంపెనీలకు ఎగ్జిక్యూటివ్ అధికారులను నియమించుకోవడంలో తోడ్పడే ఈ సంస్థ ప్రకారం మూడేండ్ల వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంటే ఆరు లక్షల మంది ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది.
ఈ ఏడాదిలో ఐటీ రంగంలో 56 వేల మంది సిబ్బందిపై వేటు పడవచ్చని గతవారం ఓ నివేదిక అంచనా వేసింది. అయితే ఉద్యోగాల కోత అంతకంటే మూడు రెట్లు అధికంగా ఉండవచ్చని, సమకాలీన సాంకేతికతకు అనుగుణంగా కార్యకలాపాలను సిద్ధం చేసుకోవడంలో సంస్థలు వెనుకబడటం ఇందుకు కారణమని హెడ్ హంటర్స్ ఇండియా వ్యవస్థాక చైర్మన్, ఎండీ కే లక్ష్మీకాంత్ అన్నారు.
వచ్చే 3-4 ఏండ్లలో ఐటీ రంగంలో పనిచేస్తున్న సగం మంది సిబ్బంది అవసరం లేకుండా పోతుందని మెకిన్సే రిపోర్టు పేర్కొంది. ప్రస్తుతం దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీలు తక్కువ నియామకాలు, ఎక్కువ తొలగింపులు మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రస్తుతం 39 లక్షల మంది పనిచేస్తున్న ఐటీ ఇండస్ట్రీలో 50-60 శాతం మందికి ఆధునిక సాంకేతిక నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, కంపెనీలకిది అతిపెద్ద సవాలు కానుందని నివేదికలో మెకిన్సే ఇండియా ఎండీ నోషిర్ కాక అభిప్రాయపడ్డారు.
అయితే, ప్రధాన నగరాల్లోని కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోని బ్రాంచ్‌లలో కోతలు అధికంగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం 35 ఏండ్లకు పైబడిన సిబ్బందిపై అధిక ప్రభావం చూపవచ్చని, ఎందుకంటే, మళ్లీ వారికి కొత్త ఉద్యోగం సంపాదించడం కష్టసాధ్యం కావచ్చని భావిస్తున్నారు.