ఇప్పటిలా ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకొని, ఓ ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ప్రాజెక్ట్స్ మీద కూర్చోబెట్టే పద్ధతికి త్వరలోనే ఐటీ కంపెనీలు మంగళం పాడనున్నాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, హెచ్ఆర్ హెడ్ టీవీ మోహన్ దాస్ పాయ్ హెచ్చరించారు. ప్రస్తుతం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్ గా పాయ్ ఇక కంపెనీలు ప్రెషర్స్ పై టైమ్ వేస్ట్ చేయదలచలేదని చెప్పారు.
అట్లాగే భవిష్యత్తులో ఒక్క బీటెక్ డిగ్రీ మాత్రమే ఉంటే ఐటీ జాబ్స్ దొరకడం కష్టమేనని కూడా అయన తెలిపారు. కోడింగ్ పరిజ్ఞానం ఉన్న వారినే తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయని ఆయన చెప్పారు. " కేవలం బీటెక్ మాత్రమే చదవకండి. ఏదో ఒక స్పెషలైజేషన్ తో ఎంటెక్ కూడా చేయండి. కోడింగ్ పరిజ్ఞానాన్ని పెంచుకోండి" అంటూ పాయ్ విద్యార్థులకు హితవు చెప్పారు.
భవిష్యత్తులో కంపెనీలు కోడింగ్ నాలెడ్జ్ ను పరిగణనలోని తీసుకొనే రిక్రూట్ చేసుకుంటాయని ఆయన తెలిపారు. కాలేజీలు సహితం విద్యార్థుల్లో కోడింగ్ నాలెడ్జ్ పెంపొందించేలా పాఠాలు చెప్పాలని అయన సూచించారు. గత రెండు దశాబ్దాల నుంచి ఫ్రెషర్స్ సాలరీస్ అంత ఆశాజనకంగా లేవని, ఐటీ ఇండస్ట్రీకే ఇదో పెద్ద ట్రాజడీ అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
దీనికి కారణం ఐటీ ఇండస్ట్రీలో వచ్చే ఆటుపోట్లేనన్నారు. పైగా ఈ పరిశ్రమలో సప్లై పెరిగిపోయి, డిమాండ్ తగ్గిందన్నారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ డిగ్రీ పాసయ్యే వాళ్లుమనదేశంలో దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్నారని అంటూ, అంత మందికి జాబ్స్ ఇవ్వగలిగే సామర్థ్యం ఏ దేశ ఎకానమీకి కూడా ఉండదని పాయ్ స్పష్టం చేశారు.