భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ. ఇస్రోగా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థ ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది. దేశాభివృద్ధి లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఏర్పాటై, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష రంగ సంస్థల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. తాజాగా ISRO మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది.
జనవరి 10న ఒకేసారి 31 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నట్లు శుక్రవారం(డిసెంబర్-29) ప్రకటించింది. వీటిలో మన దేశానికి చెందిన కార్టోశాట్–2 సిరీస్ ఉపగ్రహం కూడా ఉంది. తనకు కలిసొచ్చిన ఉపగ్రహ వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) సాయంతో వీటిని అంతరిక్షంలోకి చేర్చనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 31న PSLV-C39 ద్వారా నావిగేషన్ శాటిలైట్ ‘ఐఆర్ఎన్ఎస్ఎస్–1హెచ్’ని పరీక్షించగా విఫలమైంది.
ఈ ప్రయోగం తర్వాత PSLVని వినియోగిస్తుండటం ఇదే మొదటి సారి. ఈసారి PSLV-C40 వాహన నౌకను ఉపయోగిస్తామని ఇస్రో తెలిపింది. ఇందులో పంపనున్న 31 ఉపగ్రహాల్లో 28 విదేశీ నానో ఉపగ్రహాలు, మన దేశానికి చెందిన ఒక మైక్రో, ఒక నానో శాటిలైట్తోపాటు కార్టోశాట్ ఉపగ్రహం ఉన్నట్లు వివరించింది. విదేశీ ఉపగ్రహాలు ఫిన్లాండ్, అమెరికాలకు చెందినవని స్పష్టం చేసింది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.