ఇజ్రాయెల్, పాలస్తీనా రెండూ కలిసి మనుగడ సాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. ఇరుదేశాల మధ్య జెరూసలేం సహా పలు పెండింగ్ సమస్యలకు చర్చలద్వారానే పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. మంగళవారం నుంచి మూడు రోజలపాటు పర్యటనకు వెడుతున్న సందర్భంగా ఇజ్రాయెల్ హయామ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించారు. ఇజ్రాయెల్ వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం గమనార్హం.
జెరూసలేం సహా పలు పెండింగ్ సమస్యల పరిష్కారాన్ని భారత్ కోరుకుంటున్నదని చెప్పారు. స్వతంత్ర ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు శాంతియుతంగా మనుగడ సాగించడం టూ స్టేట్స్ సొల్యూషన్లోని ఉద్దేశం. పాలస్తీనావాసులు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ రాజధానిగా భావిస్తున్నారు.
ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చే విదేశీప్రతినిధులు పాలస్తీనా అధికారవర్గాలుండే రమల్లాకూ వెళ్లి అక్కడి నేతలను కలవడం సాధారణం. అయితే మోదీ పర్యటనలో అదేమీ లేదు. ఆయన గత మేనెలలోనే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మెహమూద్ అబ్బాస్‌ని ఢిల్లీలోనే కలిశారు.
భారత్ అక్కడ తన రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇరుదేశాలు జెరూసలేంపై ఒప్పందానికి వచ్చిన తర్వాత ఆ విషయంపై ఆలోచిస్తాం అని మోదీ చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్నకు వివిధ అంశాల్లో ఆయా దేశాల వ్యవహారాన్ని బట్టి, భారత్ స్వీయ వైఖరిని బట్టి నిర్ణయాలుంటాయని మోదీ తెలిపారు.
ఐక్యరాజ్యసమితిలోకానీ, ఇతర అంతర్జాతీయ వేదికలపై సరైన ఫలితాలు రాబట్టేందుకు ఇజ్రాయెల్‌తో సహా తమ భాగస్వాములందరితో ఉమ్మడి ప్రాధాన్యతల ఆధారంగా కలిసి ఉన్నామని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో ఏ ఒక్క దేశాన్నీ వేలెత్తి చూపే ఉద్దేశం భారత్‌కు లేదని, తాము వసుధైక కుటుంబకం అన్న సిద్ధాంతాన్ని నమ్ముతామని తెలిపారు.