ఇజ్రాయెల్ - భారత్ ల మధ్య అనుబంధం ద్వైపాక్షిక సంబంధాల నుండి భాగస్వామ్యం వరకు ఎదగడాన్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల మధ్య ఏర్పడిన సరికొత్త అవగహనకు "ఐ టూ ఐ", "ఐ ఫర్ ఐ" అంటూ సరికొత్త భాష్యం చెప్పారు.
ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు రూవెన్ రివ్లిన్‌తో ఆయన భేటీ అయి ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమానికి ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికత ఎలా ఉపయోగపడవచ్చనే అంశంపై సమాలోచనలు జరిపారు. ‘ఈ రోజు నేనొక విషయం చెప్పదలిచాను. అదేంటంటే- ఐ టూ ఐ, ఐ ఫర్ ఐ. ఇక్కడ ఐ ఫర్ ఐ అంటే ప్రముఖ లోకోక్తి మాత్రమే కాదు. ఇండియా విత్ ఇజ్రాయెల్ (ఇజ్రాయెల్‌తో భారత్), ఇండియా ఫర్ ఇజ్రాయెల్ (ఇజ్రాయెల్ కోసం భారత్) అని ఇక్కడ ఈ రెండు అక్షరాలకు అర్థం...’ అని ప్రధాని వివరించారు.
గత నవంబరులో రివ్లిన్ భారత్‌కు వచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేస్తూ రివ్లిన్ ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించడమే కాకుండా భారత్‌తో కలిసి మరింతగా పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారని అధ్యక్ష నివాసంలోని సందర్శకుల పుస్తకంలో మోదీ రాశారు. మానవాళి శ్రేయస్సుపై అపార విశ్వాసం, భారత్‌పై ఆరాధన ఉన్న రివ్లిన్ స్నేహపూర్వక వైఖరికి, ఆయన ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘మేక్ ఇన్ ఇండియా’ అనే పదబంధాన్ని రివ్లిన్ భారత్ పర్యటనలో తొలిసారిగా ప్రయోగించారనీ, అది ఇప్పుడు అందరికీ చేరిపోయిందన్న విషయం తన పర్యటనలోనూ ప్రస్ఫుటంగా కనిపించిందని చెప్పారు.
మోదీ రాకపై రివ్లిన్ స్పందిస్తూ ఆయన ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరని కొనియాడారు. ‘మన రెండు దేశాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. ఇద్దరం కలిసి ఒకే విధమైనవి చేస్తున్నాం. మీ ఆలోచనలు గురించి మాకు బాగా తెలుసు' అని పేర్కొన్నారు.