రెండు నెలల క్రితమే ప్రారంభించిన లేడీస్ హాస్టల్లో ఏడుగురు ఐటీ విద్యార్థినులు బస చేస్తుండగా, రెండ్రోజుల క్రితం హాస్టల్ ముసుగులో యజమాని చేస్తున్న ఆకృత్యాలు బయటపడ్డాయి. దీంతో హాస్టల్ యజమాని సంజీవిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ వార్తతో నగరంలో హాస్టళ్లలో బస చేస్తున్న మహిళలు భయాందోళనలకు గురయ్యారు. దాంతో చెన్నై కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టారు.
2019, జనవరి 1 నుంచి లైసెన్సు లేని ఏ హాస్టల్ చెన్నై జిల్లాలో పనిచేయకూడదని, హాస్టల్ రిజిస్ర్టేషన్ సర్టిఫికెట్, యాజమాన్యం గుర్తింపు ధృవీకరణ పత్రం లేకపోతే రెండేళ్లు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రైవేటు హాస్టళ్ల నిర్వహణకు పలు ఆంక్షలు విధించారు. లేడీస్ హాస్టళ్లలో మహిళలతో పాటు చిన్నపిల్లలు ఉండేందుకు అనుమతించకూడదని, ప్రభుత్వం నుంచి పొందిన లైసెన్సును నోటీసు బోర్డులో ఉంచాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అదే విధంగా చెన్నై జిల్లా వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన హాస్టల్స్, పిల్లల సంరక్షణ కేంద్రాలను ఈ నెల 31వ తేదీలోపు ప్రభుత్వ వెబ్సైట్లో విడుదల చేస్తామని, హాస్టళ్లలో చేరాలనుకునేవారు ఈ వివరాలు పరిశీలించాక నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. లేడీస్ హాస్టళ్లను మహిళలతోనే నిర్వహించాలని, భద్రతా విధుల్లోను మహిళ భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇక హాస్టల్లో ఎటువంటి సమస్యలు ఎదురైనా 9444841072 వాట్సాప్ నెంబరు ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.