ఐపీఎల్ మ్యాచ్ లో భాగం గా నిన్న రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో విజయాల పరంపరని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అడ్డుకట్ట వేసింది. ఈ మైదానంలో వరుసగా 9 మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు ఓవర్లలో ఆచితూచి ఆడింది. నాలుగో ఓవర్ లో రహానే తనదయిన అట తో వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఆ తరువాతి ఓవర్లో 13 పరుగులు రాబట్టారు . స్కోరు బోర్డు ఉరకలెత్తుతుండగా, కోల్ కతా కెప్టెన్ దినేష్ కార్తీక్, రహానే (36) ను అద్భుతమైన త్రోతో రనౌట్ చేసి పెవిలియన్ కు పంపాడు.
ఆ తరువాత షార్ట్ (44) మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. సంజూ శామ్సన్ (7), రాహుల్ త్రిపాఠి (15), బెన్ స్టోక్స్ (14) దారుణంగా విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది.
తరువాత బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ తోలి ఓవర్ లోనే లిన్ (0) వికెట్ కోల్పోయినప్పటికీ రాబిన్ ఉతప్ప (48), సునీల్ నరైన్ (35) ధాటిగా ఆడడంతో లక్ష్యానికి చేరువైంది. దినేష్ కార్తీక్ (42), నితీశ్ రాణా (35) రాణించడంతో కోల్కతా 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన నితీశ్ రాణా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు.