ఇన్ఫోసిస్‌కు సీఈవో, ఎండీ విశాల్ సిక్కా రాజీనామా చేయడంతో ఆ సంస్థ భారీగా నష్టపోయింది. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. గంటలో ఆ సంస్థ రూ.16 వేల కోట్లు నష్టపోయింది. సిక్కా రాజీనామా విషయం తెలియగానే ఇన్ఫీ షేర్లు ఏడు శాతం అంటే రూ.71 పడిపోయాయి. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ జూన్ 30 నాటికి రూ.2.1 లక్షల కోట్లుగా ఉంది. అందులో ఇప్పుడు ఏడు శాతం అంటే సుమారు రూ.16 వేల కోట్లు ఒక్క గంటలోనే కోల్పోవడం గమనార్హం.
9.15 గంటలకు మార్కెట్ ఓపెన్ కావాల్సి ఉండగా, 9.09 గంటలకు సిక్కా రాజీనామా వార్తను బీఎస్ఈకి ఇన్ఫోసిస్ వెల్లడించింది. 9.17 గంటల సమయంలో సంస్థ షేర్లు కొద్దిగా పెరిగాయి. ఆ తర్వాత దారుణంగా పతనమయ్యాయి. ఒక్కో షేరు ధర రూ.977 నుంచి రూ.944కు పడిపోయింది. తనపై వ్యక్తిగత దాడులు ఎక్కువవుతున్న కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు సిక్కా ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించిన విషయం తెలిసిందే.
మరోవైపు గత కొన్ని నెలల నుంచి కంపెనీలో పైస్థాయిలో ఉన్న ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేస్తూ వస్తున్నారు. ఎడ్జ్ ప్రొడక్ట్స్ గ్లోబల్ హెడ్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అనిర్బన్ దే, ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్ ఎండీ యూసఫ్ బషీర్, ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ రితికాసూరి తదితరులు కంపెనీకి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
ఇంకోవైపు, కంపెనీలో పలువురికి భారీ వేతనాల పెంపు అంశం కూడా వివాదాస్పదమైంది. కిందిస్థాయి ఉద్యోగుల కంటే ఉన్నతస్థాయి ఉద్యోగుల జీతాలను భారీగా పెంచడం సరికాదంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే.