ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో ఆయన తప్పుకోవడం చర్చనీయాంశమైంది. సిక్కా రాజీనామాతో తాత్కాలిక సీఈవోగా కంపెనీ సీఓఓ ప్రవీణ్ రావ్ను ఇన్ఫోసిస్ నియమించింది.
సిక్కాను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా నియమించాలని బోర్డు నిర్ణయించినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక నుంచి సిక్కా సంస్థ వ్యూహాత్మక అంశాలపై దృష్టి సారించనున్నారు. ఆయన ఏడాది వేతనం ఒక డాలర్. విశాల్ సిక్కా రాజీనామాతో ఇన్ఫోసిస్ షేర్లు 7.6 శాతం మేర పతనమయ్యాయి.
కొంత కాలంగా ఇన్ఫోసిస్ పనితీరుపై నారాయణమూర్తితోపాటు ఇతర వ్యవస్థాపకులు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తుల కొనుగోళ్లు, పెద్ద స్థానాల్లో ఉన్న వారి జీతాలపై బహిరంగంగానే వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా విశాల్ సిక్కా ప్రైవేట్ చార్టర్స్లో వెళ్లి కస్టమర్లను కలవడం, పాలో ఆల్టోలో ఆఫీస్ ఏర్పాటు చేయడంపై నారాయణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అసలే కష్టాల్లో ఉన్న సంస్థ ఇప్పుడు విశాల్ సిక్కా రాజీనామాతో మరిన్ని సవాళ్లు ఎదుర్కోనుంది. సిక్కా రాజీనామాకు వివరించిన కారణాలను సంస్థ అర్థం చేసుకుందని సంస్థ వెల్లడించింది.