భారత్ - చైనాల మధ్య గత మూడు నెలలుగా సరిహద్దుల్లో ఉద్రిక్తలకు దారితీస్తున్న మూడు నెలలుగా కొనసాగుతున్న డోక్లాం వివాదానికి ఎట్టకేలకు తెరపడిన్నట్లు ఉభయ దేశాలు ప్రకటించాయి. భారత్ - భూటాన్ - చైనా ట్రైజంక్షన్ అయిన డోక్లాం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించిన్నట్లు భారత్ ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ సోమవారం మీడియా ప్రకటన ద్వారా వెల్లడించింది.
చర్చలతో ఇది సాధ్యమైనట్లు విదేశాంగ శాఖ పేర్కొంది."డోక్లాం ఘటనపై భారత్, చైనా మధ్య గత కొన్ని వారాలుగా దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో డోక్లాం సరిహద్దు నుంచి సైన్యాలను వెనక్కి తీసుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం సైన్యాలు వెనక్కి వెళ్తున్నాయి" అని భారత్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 3-5 తేదీలలో చైనాలో జరుగనున్న బ్రిక్స్ సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన జరుపనున్న సమయంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇప్పటికే డోక్లామ్లో రెండు దేశాల బలగాల ఉపసంహరణ ప్రారంభమైందని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే మొత్తం బలగాల ఉపసంహరణ ప్రక్రియ మాత్రం ఇవాళే ముగియదని తెలిపింది.
అయితే చైనా విదేశాంగ శాఖ మాత్రం కేవలం భారత బలగాలు ఇప్పటికే పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని మాత్రమే చెప్పారు, చైనా బలగాలు మాత్రం అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తాయని స్పష్టం చేయడం గమనార్హం. గత రెండు నెలలుగా బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా తీవ్ర ఒత్తిడికి గురిచేసినా, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వెనుకడుగు వేయని భారత్ ఇప్పుడు `ఏకపక్షంగా' ఈ ప్రకటన చేయడం విస్మయం కలిగిస్తుంది.