కేంద్ర ప్రభుత్వ వైమానిక సంస్థ ఎయిర్ ఇండియా ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయించిన మరుసటి రోజుననే దేశంలో అతిపెద్ద విమానసంస్థ అయిన ఇండిగో కొనుగోలుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది. ఇంతకు ముందే ఎయిర్ ఇండియా ను సొంతం చేసుకోవడం పట్ల టాటా ఆసక్తి చూపడం తెలిసిందే.
ఈ విషయమై ఇండిగో సూత్రప్రాయంగా ఆసక్తి తెలిపిన్నట్లు, మరి కొన్ని జాతీయ, అంతర్జాతీయ వైమానిక సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు పౌర విమాన మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అంతులేని ఋణభారంతో ఎయిర్ ఇండియా కొట్టుమిట్టాడు తుండడంతో ప్రైవేట్ పరం చేయాలనీ ఆలోచనలు కొంతకాలంగా జరుగుతున్నాయి.
2012లో యుపిఎ ప్రభుత్వం రూ 30 వేల కోట్ల మేరకు ఆర్ధిక సహాయం అందించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. వాజపేయి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనలు చేసినా పౌరవిమాన శాఖ నుండి ప్రతిఘటన ఎదురు కావడంతో సాధ్యపడ లేదు.
దేశంలో అతి పెద్ద వైమానిక సంస్థగా ఉంటూ వస్తున్న ఎయిర్ ఇండియా గత రెండు దశాబ్దాలుగా తన ప్రాబల్యం కోల్పోతూ వస్తున్నది. ముఖ్యంగా గత శతాబ్ద కాలంగా ప్రైవేట్ విమాన సంస్థలు ముందడుగు వేయడంతో ప్రస్తుతం దేశంలో విమాన ప్రయాణికులతో 13 శాతంకు మించి ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించడం లేదు.
ఎయిర్ ఇండియా కన్నా ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ ఎక్కువ విమానాలు నడుపుతున్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియా అప్పులు రూ 52 వేల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం ఎయిర్ ఇండియా ను ప్రైవేట్ వారికి అమ్ముతారా లేదా 51 శాతం షేర్ లను మాత్రమే అమ్ముతారా అనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసి ఉంది.