Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పైశాచికత్వనికి పరాకాష్టగా మారిన ఇండిగో

Category : national

ఢిల్లీ విమానాశ్రయంలో రాజీవ్ కటియాల్ అనే పెద్దాయనపై ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది దాష్టీకం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ విషయంలో సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసింది పోయి.. ఇండిగో యాజమాన్యం మరో తప్పుచేసింది. ఈ దారుణాన్ని వీడియోతీసిన ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది. మూడు వారాల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా ఈ వీడియో ద్వారా బయటపడింది.

దీంతో వేనువంటే స్పందించిన కేంద్ర పౌర విమానయానశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సవివరంగా నివేదిక సమర్పించాలనీ… దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆగమేఘాల మీద స్పందించిన ఇండిగో… ‘‘ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించిన వారిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపాం. ఈ సంఘటనకు ప్రధాన కారకుడైన ఉద్యోగిని వెంటనే విధుల్లో నుంచి తొలగిస్తున్నాం. అతడే ఈ పరిస్థితికి ప్రేరేపించి, తీవ్రతరం చేసినట్టు విచారణలో తేలింది…’’ అని ట్వీట్ చేసింది. అయితే తొలగించిన ఉద్యోగి పేరు మాత్రం తన ప్రకటనలో వెల్లడించలేదు.

దీనిపై ఆరా తీసిన మీడియా సిబ్బందికి షాకింగ్ విషయం తెలిసింది. ఇండిగో సిబ్బంది దాష్టీకాన్ని వీడియో తీసి, అది బయటికి వచ్చేందుకు కారణమైన మోంతు కార్లా అనే ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే తనను ఉద్యోగం నుంచి తొలగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు సదరు ఉద్యోగి. ఏం జరిగిందో తనకు తెలియదని.. అటువైపుగా వెళుతూ చూసిన దాన్ని వీడియో తీశానని చెప్పారు.

ఆ వీడియోను సహ ఉద్యోగికి పంపానని చెప్పారు. అయితే తను దాన్ని ఉన్నతాధికారులకు చూపిస్తానన్నాడని… కానీ తిరిగి తిరిగి అంతా తనమీదకే వచ్చిందని తెలిపాడు. గత అక్టోబర్ 30న ఉద్యోగం నుంచి తొలగించారని అన్నాడు. గర్భవతి అయిన భార్య ఉందని మొరపెట్టుకున్నా వినలేదని వాపోయాడు. ఇండిగో తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Related News