నోట్ల రద్దు నుండి తాజాగా జీఎస్టీ వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆన్లైన్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించేందుకు ఎంతగా ప్రయత్నం చేస్తున్నా భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. దేశంలో అత్యధిక ఖాతాదారులు ఆన్లైన్ కంటే కూడా బ్యాంకు శాఖలకు వెళ్లి లావాదేవీలను జరుపుకోవడమే మేలని భావిస్తున్నట్టుగా ఒరాకిల్ జేడీ పవర్ ఇండియా జరపిన 'రిటైల్ బ్యాంకింగ్-2017' అధ్యయనం తెలిపింది.
బ్యాంకింగ్ ఖాతాదారులు గడిచిన 12 నెలల కాలంలో కనీసం ఒక్కసారైనా బ్యాంకు శాఖ లేదా స్టోర్‌ను సందర్శించినట్టుగా ఈ అధ్యయనం వెల్లడించింది. దేశంలో చాలా మంది బ్యాంకింగ్ లావాదేవీలకు తన దగ్గరలోని బ్రాంచీలకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నట్టుగా తేలిందని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న గ్లోబల్ మార్కెటింగ్ సమాచార సంస్థ జెడి పవర్ సీనియర్ డైరెక్టర్ గోర్డన్ షీల్డ్ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య కాలంలో దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలలోని 5400 మందితో ముఖాముఖి అభిప్రాయ సేకరణ జరిపిన తరువాత తమ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు షీల్డ్ వివరించారు.
సంతృప్తికరమై బ్యాంకింగ్ సేవలను అందించే విషయంలోనూ భారత్ మిగతా మేటి దేశాలతో పోలిస్తే వెనకబడే ఉందని ఫీల్డ్ వివరించారు.అధ్యయనం ప్రకారం ఈ విషయంలో మన పొరుగు దేశం చైనా 806 ఇండెక్స్ పాయింట్స్‌తో ముందు వరసలో ఉంది. జాబితాలో అమెరికా (793), ఆస్ట్రేలియాల (748) తరువాత స్థానంలో భారత్ (672) ఉందని తెలిపింది. మొత్తం రిటైల్ బ్యాంకింగ్ ఖాతాదారుల్లో 48 శాతం మంది ఇంకా తమకు సంబంధించిన బ్యాంకు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకొనేందుకు ఆసక్తే కనబరచడం లేదట.
భద్రతా కారణాల దృష్ట్యా మొత్తం రిటైల్ ఖాతాదారుల్లో నాలుగో వంతు మంది మొబైల్ బ్యాంకింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తేలింది. బ్యాంకులు కొత్త ఉత్పత్తులను అందించే ముందు ఖాతాదారుల ఆర్థిక అవసరాలేంటి అనే విషయంపై విత్త సంస్థలు దృష్టి పెట్టడం లేదని మూడో వంతు (దాదాపు 74 శాతం) మంది బ్యాంకుల కొత్త సేవలపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ఏడు శాతం మంది బ్యాంకర్లే కొత్త సేవలను గురించి వివరాలను ఖాతాదారులకు వెల్లడిస్తున్నారు. దీంతో వారు కొత్త సేవల పట్ల అవగాహన లేమితోనే ముందుకు సాగుతున్నారు.
సెక్యూరిటీ కారణాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపినపుడు ఎదురయ్యే అనిశ్చితి కారణంగానే ఎక్కువ మంది భారతీయులు ఆన్లైన్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటోందని పరిశ్రమ వర్గాల వారు చెబుతున్నారు.