మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత స్టార్ షట్లర్లు తోలి రౌండ్ లోనే నిష్క్రమించారు. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచి జోరుమీదున్న తెలుగుతేజం పి.వి. సింధుకు మలేసియా ఓపెన్ లో షాక్ తగిలింది. మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో తొలి రౌండ్‌ను కూడా అధిగమించలేకపోయింది. సిరీస్ ఫేవరెట్లలో ఒకరిగా బరిలో దిగిన ఆరో సీడ్ సింధు అనామక క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలైంది.బుధవారం మూడు గేమ్‌ల పాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు 21-18, 19-21, 17-21తో అన్‌సీడెడ్ చెన్ యుఫై (చైనా) చేతిలో ఓడింది.మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ నం.8 సైనా 21-19, 13-21, 15-21 లతో నం.2 షట్లర్ అకానె యమగూచి (జపాన్) చేతిలో ఓడిపోయి టోర్నీ నుండి వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్‌లో అజయ్ జయరాం 21-11, 21-8తో వరుస గేమ్‌ల్లో కియావో బిన్ (చైనా)పై గెలిచి ముందంజ వేశాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి జోడీ ముందంజ వేసింది. తొలి రౌండ్ పోరులో ఈ జోడీ 19-21, 21-19, 23-21తో కిమ్-లైన్ (డెన్మార్క్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మను అత్రి, సుమీత్ జోడీ ఓడింది.