సింగపూర్ తాత్కాలిక అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన జే వై పిళ్లై ఎన్నికయ్యారు. ఈ నెల 23 అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకూ దేశ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతారు. సింగపూర్ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టోనీ టాన్ కెంగ్ యమ్ నుంచి పిళ్లై శుక్రవారం బాధ్యలు స్వీకరించారు.
84 ఏళ్ల సామాజికవేత్త పిళ్లై కౌన్సిల్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్స్ (సీపీఏ)కు ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 1991 నుంచి సింగపూర్ అధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్పడటం ఇదే తొలిసారి. గత మే నెలలో టాన్ విదేశీ పర్యటన కోసం యూరప్ వెళ్లినప్పుడు కూడా పిళ్లై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2007లో అప్పటి అధ్యక్షుడు ఎస్ ఆర్ నాథన్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా దాదాపు 16 రోజులు అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నెల 23న జరగబోయే ఎన్నికల్లో మలై సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు బరిలో నిలిచే అవకాశాలున్నాయని ఓ వార్తా సంస్థ తెలిపింది.