బ్రిటన్లో భారత సంతతికి చెందిన పన్నెండేండ్ల బాలుడు దోషి రాహుల్ 162 ఐక్యూతో ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్లను దాటేశాడు. బ్రిటన్లో చైల్డ్ జీనియస్ పేరిట ప్రఖ్యాత చానల్-4 నిర్వహించిన టెలివిజన్ క్విజ్ పోటీల్లో విజయం సాధించాడు.
నిన్నటివరకు సామాన్యుడిగా ఉన్న బాలుడు క్విజ్ పోటీల్లో ఒక్కో రౌండ్లో చకచకా సమాధానాలు చెప్పి సత్తాచాటుతూ.. చివరి రౌండ్లో తొమ్మిదేండ్ల రోనన్ను 10-4తో ఓడించి తాజా సిరీస్లో విజయంతో సంచలనాలకు మారుపేరయ్యాడు.
ఫైనల్లో ఎడ్వార్డ్ జెన్నర్ వైద్య ఆవిష్కరణ, 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో పద్ధతులు అనే అంశాలను ఎంచుకోవడంతోనే రాహుల్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఉత్తర లండన్లోని పాఠశాలలో చదువుతున్న రాహుల్.. 19వ శతాబ్దంలోని కళాకారులు విలియం హాల్మన్ హంట్, జాన్ ఎవరెట్ మిలియాస్పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చైల్డ్ జీనియస్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పురాతనమైన ఉన్నత ఐక్యూ సమాజం- మెన్సాక్లబ్కు సైతం సభ్యుడిగా రాహుల్ అర్హత సాధించాడు. ఈ విజయం తమకెంతో ఆనందాన్నిచ్చిందని రాహుల్ తండ్రి మినేశ్, తల్లి కోమల్ తెలిపారు.