//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైబర్ దాడుల భయంతో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో

Category : business


దేశీయ ఐటీ దిగ్గజం విప్రోకు సైబర్ దాడుల భయం వెంటాడుతున్నది.   సంస్థ ఐటీ వ్యవస్థపై సైబర్ దాడుల వల్ల తమ క్లయింట్లకు భారీ పరిహారం చెల్లించాల్సి రావచ్చని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. 

క్లౌడ్‌కు అనుసంధానితమయ్యే కంప్యూటర్లు, సర్వర్ల సంఖ్య గణనీయంగా పెరుగడంతో తదనుగుణంగా సైబర్ దాడికి గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని విప్రో  భావిస్తున్నది. తమ ఐటీ వ్యవస్థను రక్షించుకునేందుకు తగిన ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు భద్రతా స్థాయిని సమీక్షించుకుంటున్నప్పటికీ అంతర్జాలంలో సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని సందర్భాల్లో సైబర్ దాడులను సమర్థవంతంగా నివారించడం సాధ్యపడకపోవచ్చని కలత చెందుతున్నది. 

ఈమధ్యే భారత్‌తోపాటు వందకు పైగా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లు, ఐటీ నెట్‌వర్క్‌లు వాన్నా క్రై ర్యాన్‌సమ్‌వేర్ దాడికి గురయ్యాయి. ఈ దాడికి గురైన వాటిల్లో చాలావరకు మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీ వంటి పాత వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే కంప్యూటర్లే. గత ఏడాదిలో కనీసం 138 కోట్ల రికార్డుల డాటా చౌర్యానికి గురైందని ఫిర్యాదులందాయి. అంటే, సెకండుకు 43 రికార్డుల చొప్పున హ్యాకింగ్‌కు గురయ్యాయన్నమాట. 

ఈమధ్యకాలంలో దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తుల సంస్థ బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) లు కూడా ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశాయి.