భారత జట్టు ప్రధాన కోచ్ గా కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. ఇందుకోసం బోర్డు ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే స్థానంలో రాహుల్ ద్రవిడ్ సరైన ఎంపిక అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్. భారత జట్టుకు కోచ్‌గా సేవలందించేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, అయినప్పటికీ కుంబ్లేకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నాడు. లేని పక్షంలో క్రికెట్లోని మూడు ఫార్మాట్ల పట్ల మంచి అవగాహన ఉన్న రాహుల్ ద్రవిడ్ ఆ స్థానానికి పూర్తి న్యాయం చేయగలరన్నారు.
ద్రవిడ్ కంటే మెరుగైన వారిని బీసీసీఐ ఎంచుకోలేదని.. ఒకవేళ భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు అందుకునేందుకు ద్రవిడ్ సిద్ధంగా ఉంటే అతని ఎంపికే సరైనది అని పాంటింగ్ తెలిపాడు. కపిల్‌దేవ్(1999) తర్వాత భారత జట్టుకు పూర్తిస్థాయి కోచ్ సేవలను అందించిన భారతీయుడు అనిల్‌కుంబ్లేనే. కపిల్‌దేవ్ తర్వాత జాన్‌రైట్, గ్రేగ్ చాపెల్, గ్యారీ కిర్‌స్టన్, ఫ్లెచర్ భారత జట్టుకు సేవలను అందించారు.