ఐసీసీ ఈవెంట్లలో దాయాదిపై తనకున్న రికార్డును కొనసాగిస్తూ భారత్ మరో ఘన విజయం గ్రాండ్ విక్టరీ సాధించింది. చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బి పోరులో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బర్మింగ్‌హామ్ మ్యాచ్‌లో టీమిండియా 124 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి)తో జయభేరి మోగించింది.
వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో పాక్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. అయితే ఛేదనలో సర్ఫ్రాజ్ సేన భారత బౌలర్ల ధాటికి 33.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. అజర్ అలీ (65 బంతుల్లో 6 ఫోర్లతో 50), మహ్మద్ హఫీజ్ (33) మాత్రమే కాస్త పోరాడారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు, రవీంద్ర జేజా, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 48 ఓవర్లలో మూడు వికెట్లకు 319 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 91), శిఖర్ ధవన్ (65 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 68) అర్ధ సెంచరీలతో శుభారంభం ఇవ్వగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (68 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 81 నాటౌట్), యువరాజ్ సింగ్ (32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 53) ధనాధన్ ఆటతో భారీ స్కోరు అందించారు.
చివర్లో హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్, హసన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. విధ్వంసక ఆటతీరుతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన యువరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఏడు నెలల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రోహిత్.. ఊహించినట్లుగానే తన ఫామ్‌ను చూపెట్టాడు. ధవన్‌తో కలిసి 2013 ఆటను పునరావృతం చేశాడు. తొలి ఓవర్లో ఆమిర్ అద్భుతమైన స్వింగ్‌తో కాస్త ఇబ్బందిపెట్టినా... ఇతర బౌలర్లను ముంబైకర్ ఎదుర్కొన్న తీరు సూపర్బ్.