శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజున భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఓపెనర్ శిఖర్ధావన్తోపాటు చటేశ్వర పూజరా సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తొలి రోజు ఆటముగిసే సరికి భారత్ 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. పుజారా 144 పరుగులతోనూ, అజింక్యా రహానే 39 పరుగులతోనూ క్రీజ్‌లో వున్నారు.
టెస్టుల్లో తొలి రోజు స్కోరులో భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. 2009లో కాన్పూర్‌లో జరిగిన టెస్టులో శ్రీలంకపైనే భారత్ తొలిరోజున 400 పరుగులు చేసింది. అయితే విదేశీ గడ్డపై భారత్‌కు ఇది తొలి రోజు విషయంలో అత్యుత్తమ స్కోరు. 2009లో న్యూజిలాండ్‌పై తొలిరోజున చేసిన 375 పరుగులను భారత్ బుధవారం ఆధిగమించింది.
ముందుగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్‌తో కలిసి అభినవ్ ముకుంద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 12 పరుగులు చేసి 8వ ఓవర్లో నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ దిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అప్పుడు జట్టు స్కోరు 27 పరుగులు. ఈ దశలో ధావన్-పుజారా జోడీ శ్రీలంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబర్చి లంచ్ విరామ సమాయానికి 115/1 పరుగులు తీశారు. ధావన్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
పుజారా చక్కగా స్ట్రైక్ రొటేట్ చేయడంతో ధావన్ వరుస బౌండరీలతో శతకం చేశాడు. మరోవైపు పుజారా కూడా అర్థ సెంచరీ అందుకున్నాడు. 40 ఓవర్లకే భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. 52వ ఓవర్లో ప్రదీప్ బౌలింగ్‌లో 190 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి మాథ్యుస్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ధావన్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పుడు జట్టు స్కోరు 280. 168 బంతుల్లో 31 ఫోర్లతో ధావన్ 190 పరుగులు చేశాడు.
కేవలం రెండో సెషన్లోనే ధావన్ 126 పరుగులు చేశాడు. దీంతో ఒక సెషన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా ధావన్ నిలిచాడు.అంతకు ముందు 2009లో ముంబయిలో శ్రీలంకపై టెస్టులో సెహ్వాగ్ ఒక సెషన్లో 133 పరుగులు చేశాడు. ధావన్-పూజరా జోడీ రెండో వికెట్‌కు 253 పరుగులు జోడించింది. డబుల్ సెంచరీ సాధించలేకపోయిన తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు (187)ను ధావన్ ఈ మ్యాచ్‌తో అధిగమించాడు.
ధావన్ అవుట్‌తో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశ పర్చాడు. కేవలం 3 పరుగులతో (8 బంతులు) ప్రదీప్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి అవుటయ్యాడు. కోహ్లి అవుట్‌తో వైస్ కెప్టన్ అజింక్యా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు. పుజారా-రహానే జోడీ శ్రీలంక బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. 67వ ఓవర్లో పుజరా సెంచరీ పూర్తయింది. పూజారాకు ఇది 12వ టెస్టు శతకం. ఆట ముగిసే సమయానికి పుజారా 144 పరుగులు (247 బంతుల్లో 12 ఫోర్లు), రహానే 39 పరుగులు (94 బంతుల్లో ఒక ఫోర్) నాటౌట్‌గా నిలిచారు. పూజారా-రహానే జోడీ నాలుగో వికెట్‌కు అజేయంగా 113 పరుగులు జత చేసింది. భారత్ కోల్పోయిన మూడు వికెట్లను శ్రీలంక బౌలర్ నువాన్ ప్రదీప్ సాధించడం విశేషం.