//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్లూవేల్‌ మరణాల్లో మొదటి స్థానంలో భారత్‌

Category : national

రోజుకోచోట పంజా విసురుతున్న ప్రాణాంతక క్రీడ బ్లూవేల్ చాలెంజ్ మొదట్లో రష్యా ను వణికించిన, ఇప్పుడు భారత్ లో  అలజడి సృష్టిస్తున్నది.  మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ గేమ్ లుండే సైట్ లకు లింక్ లు తొలగించమని గూగుల్, ఫేస్‌బుక్, యాహూ వంటి సంస్థలను  ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో ఇప్పుడు ఈ తిమింగలం రంగులు మారుస్తోంది. కొత్తకొత్త పేర్లతో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశిస్తోంది. సైలెంట్‌ హౌజ్‌, ఎ సీ ఆఫ్‌ వేల్స్‌, వేక్‌అప్‌ 4.20 ఏఎం తదితర మారుపేర్లతో బ్లూవేల్‌ క్రీడ కొనసాగుతున్నట్లు యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చనిపోతున్న చిన్నారులు 12-19 ఏళ్ల మధ్య వయస్కులే ఉంటుండటంతో అప్రమత్తత ప్రకటించింది.అయినా ఇంకా ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 గతంలో వూహించిన దాని కన్నా ఎక్కువ మందే మృత్యువాతపడినట్లు తాజా ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. పలు సంఘటనలకు ఈ గేమ్ కారణమని పోలీస్ లు నిర్ధారణ చేయలేక పోయినా మనదేశంలో చాలామంది యువకుల ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించినట్లు స్పష్టం అవుతుంది.

ఈ గేమ్ ఉచ్చులోపడిన 14 ఏండ్ల విద్యార్థి ముంబైలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి జూన్ 30న చనిపోవడం భారత్‌లో బ్లూవేల్‌కు సంబంధించి వెలుగు చూసిన తొలి ఘటన. అనంతరం డెహ్రాడూన్, పశ్చిమ మిడ్నాపూర్, పుణెలో మూడు ఘటనలు వెలుగుచూసినా, బ్లూవేల్ కారణంగానే అవి జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు మాత్రం దొరుకలేదు. కానీ, ఈ ఘటనలన్నింటిలోనూ చనిపోయిన పిల్లలు ఏదో ఒక సందర్భంలో బ్లూవేల్ గేమ్ గురించి సన్నిహితుల వద్ద ప్రస్తావించడం గమనార్హం.

ఆగష్టు 12 న పశ్చిమ బెంగాల్ లో 10వ తరగతి విద్యార్థి ఒకడు ఈ ఆట ఆడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అతని మృతదేహం స్నానాలగదిలో మొహానికి ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి, తాడుతో బిగించుకొని కనబడింది. ఇక షోలాపూర్, ఇండోర్‌లలో ఇద్దరు విద్యార్థులు బ్లూవేల్ టాస్క్‌లతో ఆత్మహత్యకు ప్రయత్నించగా, సహచరులు, పోలీసులు అడ్డుకోగలిగారు. తాజాగా కేరళలో రెండు ఉదంతాలు వెలుగు చూశాయి. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ వల్లే ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడిన అనంతరం ఆగస్ట్‌ 30న విఘ్నేష్‌ అనే కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం మృత్యు ‍క్రీడలుగా మారిన బ్లూవేల్‌ ఛాలెంజ్‌ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై మద్రాస్‌ హైకోర్టు తాజాగా సీరియస్‌ అయింది. ఇలాంటి గేమ్స్‌పై తీవ్ర చర్యలు చేపడతామని హెచ్చరించింది.

చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న బ్లూవేల్‌ తరహా గేమ్స్‌ను నిషేధించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆదేశించాలన్న న్యాయవాది కృష్ణమూర్తి అప్పీల్‌పై జస్టిస్‌ కేకే శశిధరన్‌, జీఆర్‌ స్వామినాధన్‌లతో కూడిన మధురై బెంచ్‌ ఈ మేరకు పేర్కొంది. ఈ అంశాన్ని తాము సుమోటోగా స్వీకరించి ఈనెల 4న విచారణ చేపడతామని తెలిపింది.

బ్లూవేల్ ప్రాణాంతక క్రీడను రూపొందించింది రష్యాకు చెందిన 22 ఏండ్ల ఫిలిప్ బుడేకిన భయం ఆధారంగా గేమ్‌ను తయారు చేయాలనుకున్నానని, దీంట్లో భాగంగానే బ్లూవేల్ చాలెంజ్‌ను సృష్టించానని చెప్పాడు.  రష్యాలో 130మందికి పైగా టీనేజర్లు ఈ గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో బుడేకిన్‌ను గత మేనెలలో పోలీసులు అరెస్టు చేశారు. బుడేకిన్ నేరుగా కొంతమంది చిన్నారులకు క్యురేటర్‌గా టాస్క్‌లు ఇచ్చాడని దర్యాప్తులో తేలింది. 

విచారణ సందర్భంగా ఆయన మానసిక స్థితి సరిగాలేదని తేలింది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. "ఇలాంటి గేమ్ తయారు చేసినందుకు నేను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. రష్యాలో 117మంది టీనేజర్లు ఆత్మహత్య చేసుకోవడానికి నేను బాధ్యుడిని" అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుడేకిన్ బాధపడ్డాడు. విచారణ అనంతరం రష్యా కోర్టు ఆయనకు మూడేండ్ల కారాగారశిక్ష విధించింది. అమెరికా, బ్రెజిల్, అర్జంటేనియా, ఇటలీ, చైనా వంటి దేశాలకు కూడా వ్యాపించింది.

బ్లూవేల్ చాలెంజ్ అనేది కేవలం యాప్ గేమ్ కాదు. అది ఆన్‌లైన్ ద్వారా అందే సూచనల సమాహారం. బ్లూవేల్ గేమ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్‌చాట్ చివరకు వాట్సప్ వంటి సోషల్‌మీడియా వేదికల ద్వారా విస్తరిస్తున్నది. క్యురేటర్లు అనే వ్యక్తులు చాటింగ్‌ల ద్వారా ఈ చాలెంజ్‌లకు దిగుతారు. రోజుకు ఒక టాస్క్ చొప్పున 50 రోజుల పాటు ఇస్తారు. తాము చెప్పిన్నట్లు చేయమంటారు.

ఇక్కడ రకరకాల హ్యాష్‌టాగ్‌ల ద్వారా బ్లూవేల్ గేమ్‌లోకి టీనేజర్లను క్యురేటర్లు లాగుతారు. వారే ఆ పిల్లలకు ప్రతిరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు టాస్క్‌లను కేటాయిస్తారు. వారి ఫోన్‌నెంబర్లను తెలుసుకుంటారు. స్కైప్‌లోనూ మాట్లాడుతారు. న్యూడ్‌ఫొటోలతో సహా పలు రహస్యాలను టాస్కుల్లో భాగంగా సేకరిస్తారు. 

ఒకవేళ గేమ్‌ను మధ్యలో వదిలేసి వెళ్లేందుకు టీనేజర్ ప్రయత్నిస్తే ఆ రహస్యాలను చూపించి బెదిరిస్తారు. బ్లూవేల్ చాలెంజ్ అనేది ఒక హ్యాష్‌ట్యాగ్, ఒక లింక్, ఒక యాప్‌కు పరిమితమై లేనప్పుడు దానిని అడ్డుకోవాలంటే సోషల్‌మీడియాను పూర్తిగా నిలిపివేయాలి. అది సాధ్యమా ? లింకుల్ని తొలగించడం ద్వారా దాని విస్తరణను ప్రభుత్వం ఆపగలదా ?

Related News