శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. చతేశ్వర్ పుజార (265 బంతుల్లో 153; 13 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో రెండోరోజైన గురువారం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 133.1 ఓవర్లలో 600 పరుగులకు ఆలౌటైంది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. మాథ్యూస్ (54 బ్యాటింగ్), పెరీరా (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఉపుల్ తరంగ 64 పరుగులు చేశాడు. ఫాలో ఆన్ నుంచి గట్టెక్కాలంటే ఆతిథ్య జట్టు మరో 246 పరుగులు చేయాల్సి ఉంది.
399/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ తొలి బంతికే 400 పరుగులను క్రాస్ చేసింది. మూడో ఓవర్లో డీఆర్ఎస్ ద్వారా క్యాచ్ ఔట్ నుంచి బయటపడిన పుజారాతో పాటు రహానే (57) అలవోకగా షాట్లు కొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు మైలురాళ్లను అందుకున్నా 98వ ఓవర్లో పుజారాను ఔట్ చేయడం ద్వారా ప్రదీప్ ఈ జంటను విడగొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో నాలుగు ఓవర్ల తర్వాత రహానే కూడా వెనుదిరిగాడు.
ఈ దశలో హార్దిక్ పాండ్యా కాకుండా అశ్విన్ (47), సాహా (16) క్రీజులోకి వచ్చినా లంక బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. స్పిన్-పేస్ కాంబినేషన్లో చకచకా పరుగులు తీస్తూ ఆరో వికెట్‌కు 59 పరుగులు జతచేశారు. అయితే ఏడు బంతుల తేడాలో ఈ ఇద్దరు ఔట్‌కావడంతో భారత్ 495 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. లంచ్ వరకు భారత్ 503 పరుగులు చేసింది.
లంచ్‌కు ముందు బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో అలరించాడు. 4 పరుగుల వద్ద హెరాత్ క్యాచ్ మిస్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న పాండ్యా చూడముచ్చటైన మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 8వ వికెట్‌కు 14 పరుగులు జత చేసి జడేజా (15) ఔటైనా షమీ (30)తో కలిసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేస్తూ భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలిపి.. చివరకు లాహిర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ ఇద్దరి మధ్య 9వ వికెట్‌కు 62 పరుగులు సమకూరాయి. కొద్దిసేపటికి టీమ్ఇండియా స్కోరు 600లకు చేరుకోగా ఆ వెంటనే షమీ ఔట్‌కావడంతో ఇన్నింగ్స్‌కు తెరపడింది.