టీమ్ఇండియా మళ్లీ నిర్విరామ క్రికెట్‌కు సిద్ధమైంది. రెండున్నర నెలల పాటు సాగే ఇంగ్లాండ్ పర్యటనకు బుధవారమే శ్రీకారం చుట్టనుంది. ఇంగ్లాండ్ జట్టును ఢీకొట్టడానికి ముందు ఐర్లాండ్‌తో తలపడబోతోంది భారత్.
ఆ జట్టుతో రెండు టీ20ల సిరీస్‌కు డబ్లిన్ ఆతిథ్యమివ్వనుంది. దీని తర్వాత భారత్.. ఇంగ్లాండ్‌తో వరుసగా మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టుల్లో తలపడనుంది. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్ సిరీస్‌ను భారత్ చిన్నపాటి సన్నాహకంగా భావిస్తోంది. ఇంగ్లాండ్‌లో గత రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ ఘోర పరాభవాలు చవిచూసిన భారత్.. ఈసారి పర్యటనను భిన్నంగా ఆరంభించబోతోంది.
ముందు ఐర్లాండ్‌తో, ఆపై ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడి.. చివరగా టెస్టుల్లో తలపడబోతోంది. కీలకమైన టెస్టు సిరీస్ ఆరంభమయ్యే సమయానికి అక్కడి పరిస్థితులకు ఆటగాళ్లు బాగా అలవాటు పడతారని భావిస్తున్నారు.
ఐర్లాండ్‌తో సిరీస్‌ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. పేరుకు చిన్న జట్టే కానీ.. ఆ జట్టులో కెవిన్ ఓబ్రైన్, పోర్టర్‌ఫీల్డ్, రాన్‌కిన్, స్టిర్లింగ్, డాక్రెల్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లున్నారు. ఐర్లాండ్‌తో భారత్ మూడు వన్డేలు, ఒక టీ20 మాత్రమే ఆడింది. అన్నింట్లోనూ భారత్‌దే విజయం.