భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆసక్తిగా మొదలైంది. ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్ తొలిరోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. అశ్విన్ ఉపఖండం ఆవల కనబరిచిన అద్భుత ప్రదర్శనకు పేసర్లు అండగా నిలిచిన వేళ ఆట ఆఖరికి ప్రత్యర్థిని 285/9కు పరిమితం చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌ను కెప్టెన్ రూట్ (156 బంతుల్లో 9 ఫోర్లతో 80), బెయిర్ స్టో (88 బంతుల్లో 9 ఫోర్లతో 70)ఆదుకున్నారు.నాలుగో వికెట్‌కు వీరు 104 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జెన్నింగ్స్ (98 బంతుల్లో 4 ఫోర్లతో 42) పర్లేదనిపించాడు. స్పిన్నర్ అశ్విన్ (4/60), షమీ (2/64) సత్తాచాటగా ఉ మేష్, ఇషాంత్ చెరో వికెట్ పడగొట్టారు.
వారిద్దరు మినహా..: ఇంగ్లండ్ స్కోరు 300 వరకూ రాగలిగిందంటే అందుకు రూట్, బెయిర్ స్టో బాధ్యతాయుత ఇన్నింగ్సే కారణం.టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన అతి తక్కువ రోజుల్లో ఆరువేల పరుగుల మైలురాయిని చేరుకొన్న తొలి బ్యాట్స్‌మన్‌గా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. అరంగేట్రం చేసిన 2058 రోజుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈనేపథ్యంలో సహచరుడు అలిస్టర్ కుక్‌ను (2,168 రోజులు)ను అతడు అధిగమించాడు. అంతేనా..టీమిండియాపై ఆడిన ప్రతి టెస్ట్‌లో (ఏదైనా ఇన్నింగ్స్)లో అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్‌గా మరో అరుదైన రికార్డునూ సొంతం చేసుకున్నాడు.