కొద్దీ రోజులుగా మీడియా ద్వారా భారత్ పై విషం వెదజల్లుతున్న చైనా కు ఇప్పటి వరకు మౌనంగా ఉన్న భారత్ ధీటైన జవాబు చెప్పింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా రెండు దేశాల అధినేతలు జీ20 సదస్సు లో భాగంగా ద్వైపాక్షిక చర్చలు జరపవచ్చనే వార్త కధనాలు మరో సారి రెండు దేశాల మధ్య వాగ్వివాదానికి దారితీసాయి.
ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవంటూ ఈ భేటీని రద్దు చేశామని చైనా ప్రకటించింది. జీ20 సదస్సు కోసం గురువారం రాత్రి మోదీ జర్మనీలోని హాంబర్గ్‌కు వెళ్లనున్నారు. అసలు భేటీ కావాలని అడిగితే గదా రద్దు చేసెడిది అంటూ భారత్ అవహేళన చేసింది.
సిక్కిం సరిహద్దులోని డోకాలా ప్రాంతంలో భారత బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చైనా రోజుకో హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే అంశాన్ని అడ్డం పెట్టుకొని మోదీతో ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని ఆ దేశం తేల్చి చెప్పింది.
"అసలు మేమేమీ భేటీ కావాలని అడగనే లేదు. మరి వాతావరణం అనుకూలంగా ఉండటం లేకపోవడం అన్న ప్రశ్నే తలెత్తదు కదా" అని ఇజ్రాయెల్‌లో మోదీ వెంట ఉన్న ఓ సీనియర్ అధికారి అన్నారు. జీ20 సదస్సులో భాగంగా ఇద్దరు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చల ప్రసక్తే ఎప్పుడూ రాలేదని ఆయన స్పష్టంచేశారు.
డోక్లామ్ సమస్య పరిష్కారం తమ సైన్యాలకే అప్పగించాలని రెండు దేశాలు భావిస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. జీ20లో కాకపోయినా, అదే సమయంలో బ్రిక్స్ దేశాల సమావేశంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొనే అవకాశం ఉందని భారత అధికారులు తెలిపారు.