ఇతర దేశాలను కలుపుతూ వన్ బెల్ట్ వన్ రోడ్డు (ఓబీఓఆర్) పేరిట వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న చైనాకు షాకిచ్చేందుకు భారత్ సిద్ధమయ్యింది. శ్రీలంక దక్షిణ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకంగా డ్రాగన్ నిర్వహిస్తున్న పోర్టుకు సమీపంలో పెట్టుబడి పెట్టేందుకు భారత్ ముందుకొచ్చింది. ఇక్కడి ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను చేపట్టబోతోంది. ఇందుకు సంబంధించి ఆ దేశంతో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని శ్రీలంక విమానయాన శాఖ మంత్రి నిమల్ సిరిపాల తెలిపారు.
శ్రీలంకకు దక్షిణాన ఉన్న నగరం హంబన్‌తోట. ఓబీఓఆర్‌లో భాగంగా ఇక్కడ పోర్ట్‌ను చైనా నిర్వహిస్తోంది. ఆసియా సహా యూరప్ దేశాలకు వ్యాపార, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ఈ పోర్టుని చైనా 99 ఏళ్లపాటు లీజుకు తీసుకుంది. విస్తరణలో భాగంగా రిఫైనరీ ప్లాంట్‌నూ నిర్మించాలని తలపోస్తోంది. అయితే, చైనా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఇక్కడి స్థానికులు వ్యతిరేకిస్తుండడం గమనార్హం. మరికొందరు సైతం శ్రీలంక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. దేశాన్ని శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోయే ప్రతిపాదనపై సంతకం చేసిందంటూ మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో హంబన్‌తోటకు సమీపంలో ఉన్న మట్టాలా ఎయిర్పోర్ట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది భారత్. నష్టాల్లో ఉన్న ఈ పోర్ట్‌ను లాభాల బాట పట్టించేందుకు శ్రీలంకతో కలిసి పనిచేసేందుకు సిద్ధం అంది. ఇందుకోసం 70 శాతం వాటాగా 293 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 40 ఏళ్ల పాటు ఎయిర్‌పోర్ట్‌ను లీజుకు తీసుకోనుంది. ఎయిర్పోర్ట్ ఆదాయం పెంపులో భాగంగా ఇక్కడ ఓ ఫ్లైయింగ్ స్కూల్‌తో పాటు, మెయింటెనెన్స్ హబ్‌గా మార్చేందుకు సిద్ధపడింది. దీని వల్ల ఇరు దేశాల మధ్య పర్యాటకం కూడా వృద్ధి చెందుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు.
తొలుత ఈ విమానాశ్రయం నిర్వహణకు చైనా బిడ్ వేసినప్పటికీ ఆర్థికంగా అవగాహన కుదరకపోవడంతో చైనాకు ఈ అవకాశం దక్కలేదు. భారత్‌ను శ్రీలంక ఆహ్వానిస్తున్న విషయం తనకు తెలీదని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఓబీఓఆర్‌ను భారత్ సైతం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంకలో కొందరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఆ ప్రాంతానికి దగ్గరగా ఎయిర్పోర్ట్ నిర్వహణకు భారత్ సిద్ధపడడం గమనార్హం.