కోట్లాది అభిమానుల కలను సమాధి చేస్తూ టీమిండియా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. టీమిండియా పోరాటం సెమీఫైనల్‌తోనే ముగిసింది. అయితే లీగ్ దశ నుంచి అద్భుతంగా సాగుతున్న కోహ్లి సేన ప్రస్థానానికి నాకౌట్లో న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ కొనసాగిన తొలి సెమీస్‌లో కివీస్ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్ (3/43)కు మూడు వికెట్లు దక్కాయి. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి బృందం 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.
ఈ మ్యాచ్ లో అద్భుత పోరాటం సాగించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. అతడికి అండగా నిలిచిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (72 బంతుల్లో 50; ఫోర్, సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. కాగా రిషభ్ పంత్ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ల రాహుల్, రోహిత్, కోహ్లీ లను త్వరగా పెవిలియన్ చేర్చి ఆదిలోనే కివీస్‌కు పట్టు చిక్కేలా చూసిన పేసర్ మ్యాట్ హెన్రీ (3/37)ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. బౌల్ట్ (2/42), సాన్‌ట్నర్ (2/34)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆతిథ్య ఇంగ్లండ్–ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం విఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తలపడుతుంది.