లంక గడ్డపై భారత్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ (145 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. లంకపై భారత్‌కు ఇది ఏడో ద్వైపాక్షిక సిరీస్ విజయం కాగా, 1997 తర్వాత నాలుగోది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం 218 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. వరసగా వికెట్లు కోల్పోయిన దశలో భారత్‌ను రోహిత్ , ధోనిల భాగస్వామ్యం ఆదుకుంది. ఈ దశలో సహానం కోల్పోయిన శ్రీలంక ప్రేక్షకులు బాటిల్స్, వ్యర్థ పదార్థాలను గ్రౌండ్లోకి విసిరి మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. 45.1 ఓవర్లలో విజయలక్ష్యాన్ని భారత్ అందుకుంది.
రోహిత్ శర్మ 124 పరుగులు, ధోని 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టులో తిరిమానే 80, చండిమాల్ 36, సిరివర్థనే 29 అత్యధిక పరుగులు చేశారు. శ్రీలంక కెప్టెన్ కుపుగేదర కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. భారత బౌలర్లు బుమ్రా 27 పరుగులకు 5 వికెట్లు సాధిం చాడు. పాండ్యా, అక్షర్‌పటేల్, జాదవ్‌లకు తలా ఒక వికెట్ లభించాయి. 218 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కేవలం 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెన్ థావన్ 5, కెప్టెన్ కోహ్లీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కె.ఎల్. రాహుల్ 17 పరుగులు చేసి ధనంజయ బౌలింగ్‌లో తిరిమా నేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాదవ్ ధనంజయ బౌలింగ్‌కు డకౌట్ అయ్యాడు. దీంతో భారత్జట్టు కేవలం 61 పరుగు లకే నాలుగు ప్రధానమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కి భారత్‌ను గెలిపించాడు.
రోహిత్ శర్మకు కీపర్ ధోని అండగా నిలిచాడు. రెండో వన్డే ఓడిపోవాల్సిన దశలో భువనేశ్వర్‌కు తోడుగా నిలిచి గెలిపించిన ధోనీ మరోమారు రోహిత్‌శర్మకు తోడుగా నిలిచి భారత్ సిరిస్ విజయానికి తోడ్పడ్డాడు. ఐదు వికెట్లు తీసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.