పెరుగుతున్న ఉగ్రవాద, పిడివాద బెడదలపై భారత్, ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేశాయి. తమ బంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి విస్తరించుకున్నాయి. ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం, నిధులు సమకూర్చేవారిపై కఠినమైన చర్యలకు ఉమ్మడిగా కదలాలని తీర్మానించుకున్నాయి. రెండు దేశాల ప్రధానులు నరేంద్రమోదీ, బెంజమిన్ నెతన్యాహు జెరూసలేంలో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాద సమస్య ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఉమ్మడిపోరుతో పాటుగా వ్యవసాయం, జలసంరక్షణ, అంతరిక్షం తదితర రంగాల్లో సహకార విస్తరణపై అంగీకారం కుదిరింది. సంక్లిష్టమైన భౌగోళిక స్థితిగతుల మధ్య భారత్, ఇజ్రాయెల్ మనుగడ సాగిస్తున్నాయని, ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఎదురవుతున్న వ్యూహాత్మక ముప్పుల గురించి రెండు దేశాలకు లోతైన అవగాహన ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
ఉగ్రవాదం వ్యాపింపజేసే హింస, విద్వేషాలకు భారత్ కూడా ఇజ్రాయెల్ తరహాలోనే బలి అవుతున్నదని చెప్పారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఇతోధికంగా సహకరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయని వివరించారు.
నెతన్యాహు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని నిరోధించడంలో రెండు దేశాలు సహకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 26/11 ముంబై ఘటనను ఘోరమైన ఉగ్రదాడిగా పేర్కొన్నారు.ఉగ్రవాదులపై, ఉగ్రవాద సంస్థలపై, వారి నెట్వర్క్లపై, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి, సహాయం అందించి నిధులు సమకూర్చేవారిపై లేదా ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఉభయనేతలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఉగ్రవాద చర్యలను ఏకారణం చేత కూడా సమర్థించడం కుదరదని అందులో స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వీలైనంత త్వరలో ఆచరణలోకి తేవాలని సూచించారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును సతీసమేతంగా భారత్ సందర్శించాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు వెంటనే సమ్మతి తెలిపారు.