శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 113 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మహేంద్ర సింగ్ ధోని 87 బంతుల్లో 65 పరుగులు చేసి (10ఫోర్లు, 2 సిక్సర్లు) టీమిండియా పరువు కాపాడారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరొకసారి రెచ్చి పోయి ఆడాడనే చెప్పాలి. శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ధోని ఆదుకున్నాడు.
కాగా స్వదేశంలో భారత్ అతి తక్కువ స్కోరు 78. దీన్ని నుంచి ధోని రక్షించడంతో మరొక చెత్త రికార్డు నుంచి భారత్ తప్పించుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. ఎనిమిది పరుగులకే శిఖర్ ధావన్(0), రోహిత్ శర్మ(2), దినేశ్ కార్తీక్(0) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ టీం కష్టాల పాలైంది.
ఆ తర్వాత మరో ఎనిమిది పరుగుల సమయంలోనే మనీష్ పాండే(2), శ్రేయస్ అయ్యర్(9), కూడా అవుట్ కావడంతో భారత్ జట్టు 16 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తర్వాత వెంటనే భువనేశ్వర్ కుమార్ డకౌట్ కావడంతో భారత్ 50 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానం కల్గింది. ఆ సమయంలో ధోని చెలరేగి ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు.
స్పిన్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్(19)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జత చేశాడు. కాగా, తన వన్డే కెరీర్లో 67వ హాఫ్ సెంచరీ సాధించిన ధోని చివరి వికెట్‌గా అవుట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 38.2 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌట్ కావలసి వచ్చింది.