వన్డే సిరీస్ గెలిచిన జోరుతోనే టీ20 మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంటారని భావించినా ఎవిన్ లెవిస్ (62 బంతుల్లో 125 నాటౌట్; 6 ఫోర్లు, 12 సిక్సర్లు) ఒంటరి పోరాటం ముందు టీమ్ఇండియా బౌలింగ్, ఫీల్డింగ్ దూదిపింజల్లా తేలిపోయింది. ఈ విజయంతో విండీస్ పర్యటనను ముగించాలన్న విరాట్‌సేన ఆశలు నెరవేరలేదు. ఆదివారం జరిగిన టీ20లో భారత్ 9 వికెట్ల తేడాతో విండీస్ చేతిలో పరాజయం చవిచూసింది.
బ్యాటింగ్‌లో తిరుగులేని ఆరంభం లభించినా, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. 220 ఖాయమనుకున్న స్కోరు కాస్తా 190కి పడిపోయింది. తర్వాత తేలికైన క్యాచ్‌లు వదిలేసి విండీస్‌కు ఛేదనను తేలిక చేశారు. 191 పరుగుల లక్ష్యం కరీబియన్ జట్టుకు ఏ మూలకూ చాలలేదు. ఎవిన్ లూయిస్ (125 నాటౌట్; 62 బంతుల్లో 6×4, 12×6).. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారత బౌలింగ్‌ను వూచకోత కోసి విండీస్‌కు అలవోక విజయాన్ని అందించాడు.
టీ20ల్లో తమది ఎంతటి బలమైన, ప్రమాదకర జట్టో మరోసారి రుజువు చేసిన విండీస్, 191 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతా అనుకున్నట్లు గేల్ (18) ఏమీ భారత్‌కు ముప్పుగా పరిణమించలేదు. అతణ్ని భారత బౌలర్లు కట్టడి చేశారు. కానీ వూహించని విధంగా లూయిస్ ఉప్పెనలా భారత బౌలర్లపై పడ్డాడు.
లూయిస్ ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికే విండీస్ 66 పరుగులు చేసింది. ఐతే ఆ ఓవర్లో చివరి బంతికి ఇచ్చిన క్యాచ్ కోహ్లి, షమి మధ్య సమన్వయ లోపంతో చేజారింది. అప్పటికి అతడి స్కోరు 47. తర్వాతి ఓవర్లో లూయిస్ మరో తేలికైన క్యాచ్ ఇచ్చాడు. కానీ కార్తీక్ అందుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత లూయిస్‌ను ఆపడం భారత బౌలర్ల వల్ల కాలేదు. సిక్సర్ల మోత మోగిస్తూ 53 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన లూయిస్ శామ్యూల్స్ (36 నాటౌట్)తో కలిసి పని పూర్తి చేశాడు.