స్వీడన్‌కు చెందిన ప్రసిద్ధ గృహోపకరణాల సంస్థ ఐకియా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఫర్నీచర్ షోరూం వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులోకి రానున్నది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీ దగ్గర్లో నిర్మిస్తున్న ఈ భవన సముదాయాన్ని ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నట్లు ఐకియా భారత డిప్యూటీ మేనేజర్ ప్యాట్రిక్ ఆంటోని తెలిపారు.
సుమారు పది వేల రకాల ఫర్నీచర్ ఇక్కడ అందుబాటులో ఉండనున్నట్లు, వీటిలో భారత్‌లో ఎక్కువగా వినియోగించే 800 రకాల ఫర్నీచర్ ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని తెలిపారు. ఈ స్టోర్‌ను ఏర్పాటు చేయడంతో 1200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. వచ్చే మూడు నెలల్లో 800 మంది సిబ్బంది నియామకాలు పూర్తి చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన సంస్థ అందుకు తగ్గట్టుగానే చర్యలను ఆరంభించినట్లు ఆయన చెప్పారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 25 స్టోర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దీంట్లోభాగంగానే నగరంలో నిర్మిస్తున్న మొదటి స్టోర్ నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, ఎక్కడా రాజీపడకుండా వేగంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.
ఫర్నీచర్‌కు కావల్సిన ముడి పదార్థం (కలప) సరఫరా సవాల్‌తో కూడుకున్న విషయమని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా ముంబై, బెంగళూరులలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టోర్లకు సంబంధించి భూ సేకరణ పూర్తైందని పేర్కొన్నారు.
అలాగే ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, అహ్మదాబాద్, సూరత్, కోల్‌కతాలలో నూతనంగా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ భవనంలోనే వెయ్యి మంది కూర్చునేందుకు వీలుగా ఉండే రెస్టారెంట్‌ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.