భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ రెండు దాయాధి దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగక చాలా కాలమైంది. ఐసీసీ నిర్వహించే టోర్నీలో అప్పుడపుడు తలపడుతూ అభిమానులకు వినోదాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోపీలో ఈ దాయాధి దేశాలు తలపడనున్నాయి. జూన్ 1 నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు మధ్య జూన్ 4న మ్యాచ్ జరగనున్నది.
ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజామామ్ ఉల్ హఖ్ విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఇంగ్లాండ్ వెళ్తున్నది భారత్‌ను ఓడించడానికి మాత్రమే కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి కూడా’ అని అన్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో 2004లో భారత్‌ను ఓడించిన ఘటన పునరావృతం అవుతుందని ఇంజమామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మేం మళ్లీ గెలుస్తాం’ అని ఉద్ఘాటించారు. వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్ విజయం పాక్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిందని, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసేలా పురిగొల్పుతుందని ఆయన భావిస్తున్నారు.