పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ పరిణామాల కారణంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరుగుతుంటే,మన వద్ద కూడా ధరలు ఎంతోకొంత పెరుగుతున్నాయి.అమెరికా చైనా ట్రేడ్ వార్,ఇరాన్ పైన ఆంక్షల నేపథ్యంలో ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర 70 రూపాయలకి పైగా ఉంది.అయితే హైదరాబాదుకు చెందిన ఓ 45 ఏళ్ళ మెకానికల్ ఇంజినీర్ లీటర్ పెట్రోల్‌ను రూ.40 కి విక్రయిస్తున్నారు.ఆయన ప్లాస్టిక్‌ను ఉపయోగించి పెట్రోలు తయారు చేస్తున్నారు.ఈ మేరకు న్యూస్ 18 మీడియాలో ఈ కథనం వచ్చింది.ఈ కథనం ప్రకారం.
హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల మెకానికల్ ఇంజినీర్ సతీష్ కుమార్ ప్లాస్టిక్ ఉపయోగించి పెట్రోల్ తయారు చేస్తున్నారు.ఆయన సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖ వద్ద తన కంపెనీని రిజిస్టర్ చేయించారు.ప్లాస్టిక్ పైరాలసిస్ అనే పద్ధతిలో మూడు స్టెప్పుల్లో ప్లాస్టిక్‌ను ఫ్యూయల్‌గా మారుస్తున్నారు.ప్లాస్టిక్‌ను డీజిల్,ఏవియేషన్ ఫ్యూయల్,పెట్రోల్‌గా రీసైకిల్ చేస్తారు.దాదాపు 500 కిలోల నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్‌తో 400 లీటర్ల ఫ్యూయల్ ను ఉత్పత్తి చేయవచ్చు.దీనికి నీరు అవసరం లేదు.అలాగే వేస్ట్ వాటర్ కూడా రిలీజ్ కాదు.2016 నుంచి 50 టన్నుల ప్లాస్టిక్‌ను ఫ్యూయల్‌గా మార్చారు.
ప్రస్తుతం ఇతని కంపెనీ రోజుకు 200 లీటర్ల పెట్రోల్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇందుకు 200 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తోంది.ఇలా ఉత్పత్తి చేసిన దానిని లీటరుకు రూ.40 నుంచి రూ.50 స్థానిక ఇండస్ట్రీస్‌కు విక్రయిస్తోంది.కాగా,ప్లాస్టిక్ నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ ఫ్యూయల్‌ను వాహనాలకు వినియోగించవచ్చా లేదా అనేది పరీక్షించవలసి ఉంటుంది.పీవీసీ (పాలీ వినైల్ క్లోరైడ్),పీఈటీ (పాలీ ఇథలైన్ టెరిప్థలేట్) మినహా ఫ్యూయల్ కోసం ఏ ప్లాస్టిక్‌ను అయినా వినియోగించవచ్చును.పర్యావరణ పరిరక్షణ తమ లక్ష్యమని,తమకు ఎలాంటి కమర్షియల్ బెనిఫిట్స్ అవసరం లేదని,పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేస్తున్నామని,ఆసక్తి కలిగిన ఎంటర్ప్రెన్యూయర్స్తో తమ టెక్నాలజీని షేర్ చేసుకునేందుకు సిద్ధమని సతీష్ కుమార్ చెప్పారు.