ఇలియానా డిక్రుజ్ ప్రముఖ తెలుగు సినిమా నటీమణి.ఈమె నవంబరు 1, 1987 లో ముంబై లో జన్మించింది. ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది.
ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టాడు . తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరుగుతాయి , అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియానా.
ఇలియానా అరుణ భిక్షు దగ్గర కొంతకాలం నటనలో శిక్షణ పొందింది.తరువాత తెలుగు లో 2006లో వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో ఆమె రామ్ సరసన నటించింది. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు.
ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఈ చిత్రం విడుదలయ్యాక నాటి తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని భారీ విజయాన్ని నమోదు చేసింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగు సినిమాలో ఒక ప్రముఖ నటిగా అవతరించింది.
2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది. తరువాత తెలుగు లో రవితేజ సరసన ఖతర్నాక్ చిత్రంలో నటించింది,ఈ చిత్రం నిరాశ పరిచింది.తరువాత ఎన్టీఆర్ తో చేసిన రాఖీ ఘనవిజయం అందుకుంది.2009లో రవితేజ సరసన తను నటించిన కిక్' సినిమా ఆ సంవత్సరంలోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు కూడా తను ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డుకు పేర్కొనబడింది.
2012లో ఇలియానా శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సరసన నన్బన్ చిత్రంలో నటించింది. ఇది ప్రముఖ హిందీ చిత్రం త్రీ ఈడియట్స్ చిత్రం యొక్క పునఃనిర్మాణం. త్రీ ఈడియట్స్ లాగే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన జులాయి చిత్రంలో నటించింది.
ఇలియానా అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బర్ఫీ చిత్రంతో హింది సినిమల్లోకి అడుగుపెట్టింది. రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఇందులో ఇలియానా పోషించిన శృతి పాత్రకు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలను అందుకున్న ఇలియానా అదే చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డ్ ను గెలుచుకుంది. ప్రస్తుత తరం కథానాయికల్లో ఆసిన్, కాజల్ అగర్వాల్ తర్వాత తొలిచిత్రంతోనే భారీ విజయం అందుకున్న దక్షిణాది కథానాయికగా ఇలియానా నిలిచింది.ప్రస్తుతం ఆమె ద్రుష్టి మొత్తం బాలీవుడ్ సినిమాల ఫై నే ఉంది.