రెండు దశాబ్ధాల తర్వాత పాకిస్థాన్ మంత్రివర్గంలో తొలిసారిగా ఓ హిందూ రాజకీయ నాయకుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక ప్రధానిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన షాహిద్ అబ్బాసీ 46 మందితో తన మంత్రివర్గాన్ని శనివారం విస్తరించారు. ఆ మంత్రి వర్గంలోనే మొదటి సారి ఓ హిందూ వ్యక్తికి కూడా అవకాశం కల్పించారు.
65 ఏళ్ల దర్శన్ లాల్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్‌లోని నాలుగు రాష్ట్రాలను దర్శన్ లాల్ కోఆర్డినేట్ చేయనున్నారు. పార్లమెంట్‌కు ఆయన ఎన్నిక కావడం ఇది రెండవసారి. పీఎంఎల్-ఎన్ టికెట్‌పై ఆయన 2013లో మైనారిటీ కింద ఎన్నికయ్యారు.
సింధు ప్రావిన్సులో ఉన్న గోత్కీ జిల్లాలో ఆయన వైద్య వృత్తి చేశారు. పనామా కేసులో చిక్కుకున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో అబ్బాసీని ఆపద్దర్మ ప్రధానిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
2018లో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నవాజ్ షరీఫ్ తో పొత్తు ఏర్పర్చుకున్న వారికి, మద్దతు దారులకు మంత్రివర్గంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రుల సంఖ్యను కూడా రెట్టింపు చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ క్రిమినల్ నేరారోపణపై విచారణ జరుపుతున్నా ఇషాక్ దర్ తిరిగి ఆర్ధికమంత్రిగా వచ్చారు. కాగా, షరీఫ్ కు సన్నిహితుడైన, ఇంతకుముందు రక్షణ, ఇంధనం శాఖలను నిర్వహించిన ఖవా అసిఫ్ ను విదేశాంగ మంత్రిగా నియమించారు.