//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నాగర్ కర్నూల్ జిల్లాలో టెన్షన్ ... దాడులు ప్రతిదాడులతో కొనసాగుతున్న పోలింగ్

Category : politics state

ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీలు పోలింగ్ కు కొన్ని గంటల ముందు ఘర్షణలకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరి మీద ఒకరు దాడులకు యత్నించటం కలకలం రేపింది. ఈ సారి ఎన్నికల్లో డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేశారు. దాదాపు 150 కోట్ల రూపాయలు అధికారులు సీజ్ చేసినా ఇంకా వేల కోట్ల లో నాయకులు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కల్వకుర్తి మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పై బిజెపి నాయకులు దాడికి పాల్పడ్డారు. నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని పరిశిలించడానికి అమనగల్ మండలం జంగారెడ్డి పల్లి గ్రామానికి వెళ్లిన వంశీచంద్ రెడ్డిని బిజెపి నాయకులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా అతడిపై దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని కాంగ్రెస్ నాయకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ఇదే క్రమంలో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డి డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి యత్నించారు. డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డి సోదరుడు మర్రి వెంకట్‌రెడ్డి కార్యకర్తలతో ఐదారు వాహనాల్లో అక్కడి చేరుకున్నారు. ఒక్క సారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగం ప్రజలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించిన క్రమంలో ఇరు వర్గాల మధ్య కర్రలు, రాళ్లతో దాడులు జరిగాయి. ఘర్షణ తలెత్తింది.ఈ రోజు పోలింగ్ జరుగుతున్న నేపద్యంలో నాగర్ కర్నూల్ లో కాస్త ఉద్రిక్త వాతావరణమే నెలకొంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితి అదుపులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి నాగర్ కర్నూల్ జిల్లాలో టెన్షన్ నెలకొంది.

Related News