//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో పసుపు-కుంకుమ కలవరం

Category : state politics

హోరాహోరీగా సాగిన సాధారణ ఎన్నికలు ముగిశాయి. వచ్చే నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్‌ ముగిసి నాలుగైదు రోజులైనా రాజకీయ పార్టీల నేతలు మాత్రం ఇంకా ఓటింగ్‌ సరళిపై విశ్లేషణల్లో మునిగితేలుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పసుపు-కుంకుమపై తాజాగా ఇరు పార్టీల్లోనూ చర్చ నడుస్తోంది. డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పసుపు-కుంకుమ కింద గతంలో ఒకసారి రూ.పది వేలు చొప్పున అందజేయగా, రెండో దఫా విడుదల చేసిన డబ్బులు పోలింగ్‌కు ముందురోజే ఖాతాలకు చేరాయి. మహిళల ఓటింగ్‌ శాతం పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో విశ్వాసం నింపుతుండగా, వైసీపీ నేతల్లో మాత్రం గుబులు రేపుతోంది. పోలింగ్‌కు ముందురోజే పసుపు కుంకుమ కింద జమ అయిన డబ్బులు తీసుకున్న మహిళలంతా టీడీపీకి ఓటు వేసి వుంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే ఎన్నికల ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పసుపు-కుంకుమ పేరుతో గతంలో ఒక విడత నాలుగు దఫాలుగా రూ.పది వేలు చొప్పున అందజేసింది. రెండో విడత మరో రూ.పది వేలు ఇస్తున్నట్టు జనవరిలో ప్రకటించింది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించింది. మూడు విడతలకు సంబంధించి పోస్ట్‌డేటెడ్‌ చెక్కులను ముందుగానే అందజేసింది. అందులో మొదటి, రెండు విడతల్లో రూ.2500, రూ.3500 చొప్పున అందజేయగా, మూడవ విడతగా రూ.నాలుగు వేలు ఈ నెల 4వ తేదీన బ్యాంకుల్లో జమ చేసింది. మహిళలకు ముందుగా ఇచ్చిన చెక్‌లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలని సూచించింది. రెండు విడతల సొమ్మును మహిళలు ఎన్నికల షెడ్యూల్‌కు ముందే నగదుగా మార్చుకోగా, మూడవ విడత ఇచ్చిన చెక్కు మాత్రం పోలింగ్‌కు ముందురోజు అంటే ఈనెల పదవ తేదీన నగదుగా మారి మహిళల ఖాతాల్లో జమ అయ్యింది.

నగదు ఖాతాకు జమ కావడంతో మహిళలంతా ఆనందంలో మునిగితేలారు. మరుసటి రోజే పోలింగ్‌ జరగడంతో వారంతా తెలుగుదేశం ప్రభుత్వానికి తమ మద్దతు తెలపాలని నిర్ణయించుకుని భారీగా పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి ఈవీఎంలు చాలాచోట్ల మొరాయించడంతో ఓటు వేసేందుకు గంటలకొద్దీ సమయం ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొంతమంది మహిళలు ఓటు వేయకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటు వేయకుండా ఇంటికి వెళ్లిపోయిన వారంతా ఎండ తీవ్రత తగ్గిన తర్వాత తిరిగి పోలింగ్‌ బూత్‌ల వద్దకు వెళ్లి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన మహిళలంతా చల్లబడిన తర్వాత తిరిగి పోలింగ్‌ బూత్‌ల వద్ద క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకూ వేచి వుండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మహిళల ఓటింగ్‌ పెరగడంతో వైసీపీలో కలవరం

గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు అర్ధరాత్రి అయినా సరే తమ ఓటు వేయాలనే పట్టుదలతో పోలింగ్‌ స్టేషన్లలో వేచివుండడం చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి వరకూ వేచి వుండి ఓటేయ్యాలన్న పట్టుదల మహిళలకు ఎందుకు కలిగిందనే దానిపై ఎవరికి వారు తమకు తోచిన విశ్లేషణలు చెబుతున్నారు. పోలింగ్‌కు ముందురోజే పసుపు-కుంకుమ కింద బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు చేరడంతో ఆ రుణం తీర్చుకునేందుకే అంత పట్టుదల ప్రదర్శించి వుంటారని రాజకీయాలకతీతంగా అందరూ అభిప్రాయడుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే జిల్లాలో సుమారు 5,32,190 మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారు. వారిలో ఎంతలేదన్నా 60-70 శాతం మంది టీడీపీకే ఓటు వేసి వుంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పురుషుల్లో తమకు కొంత మొగ్గు వున్నా అదంతా కొట్టుకుపోతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

మహిళల ఓటింగ్‌ పెరగడం మాకు దెబ్బే

ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ శాతం పెరగడం, అర్ధరాత్రి వరకూ వేచి వుండి మరీ ఓటు హక్కు వినియోగించుకోవడం తమకు దెబ్బే అవుతుందని వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. పురుషుల్లో జగన్‌కు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం కనిపించిందని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజు వరకూ మంచి జోష్‌ వుండేదని, అయితే ఆ రోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని అన్నారు. ఏదేమైనా ఫలితాలు వచ్చేంత వరకూ ఏ విషయం గట్టిగా చెప్పలేమన్నారు.