ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బిజెపి దృష్టి సారించిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. గత కొంత కాలంగా జగన్ లక్ష్యంగా బిజెపి వరుసగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే జగన్ లక్ష్యంగా బిజెపి నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి
జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జాతీయ పార్టీ భాజపాతోనే ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో ఓ ప్రాంతీయ పార్టీ వలన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు చూశారని.. అందుకే మరో ప్రాంతీయ పార్టీకి అవకాశమిచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతోందనే భయం కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వైకాపా ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తోందని ఆయన మండిపడ్డారు. దీనితో బిజెపి వైకాపాను టార్గెట్ చేసిందనే వార్తలు వినపడుతున్నాయి.