అమెరికాలో స్థిరపడటం కోసం గ్రీన్ కార్డు పొందాలంటే ఇప్పుడు పుష్కర కాలం వరకు వేచి చూడవలసిందే నని ప్యూ రిసెర్చి అనే సంస్థ పేర్కొంది. అమెరికాలో శాశ్వత నివాసం అర్హత పొందాలంటే గ్రీన్ కార్డు ఉండాలి. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అక్కడికి వెళ్లేవారు ముందుగా తాత్కాలిక నివాస అనుమతి పొందిన తరువాత శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలి.
గ్రీన్ కార్డు పొందిన ఐదేండ్ల తరువాతే శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే అంతకుముందే గ్రీన్‌కార్డు పొందిన వారిని పెండ్లి చేసుకొంటే మాత్రం మూడేండ్లకే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదంతా జరగడానికి ఉద్యోగుల క్యాటగిరీలో వచ్చిన భారతీయులకు దాదాపు 12 ఏళ్ల సమయం పడుతున్నదని ప్యూ రిసెర్చి అధ్యయనంలో వెల్లడైంది. 2005 సంవత్సరంలో వచ్చిన గ్రీన్‌కార్డు దరఖాస్తులను ఈ ఏడాది పరిశీలిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇంత ఆలస్యం జరుగుతున్నా అమెరికాలో ప్రతి ఏడాది గ్రీన్ కార్డులు పొందుతున్నవారిలో ఇండియన్లే ఎక్కువ మంది ఉంటున్నారు. 2105లో 36,318 మంది భారతీయులు శాశ్వతనివాస హోదాకు మారారని, వారిలో 27,798 మంది కొత్తగా వచ్చి గ్రీన్‌కార్డులు పొందారని సర్వేలో తేలింది.
ఉద్యోగుల క్యాటగిరీలో 2010 నుంచి 2014 వరకు గ్రీన్‌కార్డులు పొందిన వారిలో 36 శాతం అంటే 2,22,000 మంది హెచ్-1బీ వీసా కలిగిన వారు. అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందుతున్నవారిలో 25 నుంచి 64 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారే 72శాతం మంది ఉన్నారని అధ్యయనం పేర్కొన్నది.