టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఆసీస్ బౌలర్లు షాకిచ్చారు. తొలి ఓవర్లో స్మృతి మందన (6)ను, పదో ఓవర్లో పూనమ్ రౌత్ (14)ను ఔట్ చేయడంతో 35 పరుగులకే టీమ్ ఇండియా 2 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో కెప్టెన్ మిథాలీతో కలిసి వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అసాధ్యమైన ఇన్నింగ్స్‌కు ప్రాణం పోసింది. కంగారూలు ఎంత భయపెట్టాలని చూసినా ఈ పంజాబీ అంత మొండిగా ఎదురొడ్డి పోరాడింది.
కెరీర్లో మరోరోజు మిగిలి లేదన్నంత కసిగా ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసింది. 115 బంతుల్లో 171 నాటౌట్, 20 ఫోర్లు, 7 సిక్సర్లతో అద్వితీయంగా ఆడింది. సూపర్ సెంచరీతో అలరించిన భారత స్టార్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. కెరీర్ మూడో సెంచరీతో పాటు ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఉమెన్ క్రికెటర్‌గా తన పేరు లిఖించుకుంది.
తొలి 50 పరుగుల వరకు నెమ్మదిగా ఆడినా, ఆ తర్వాత తన విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపెట్టింది. మూడో వికెట్‌కు 66ల పరుగులు జత చేసి మిథాలీ వెనుదిరిగినా తాను మాత్రం శివాంగిలా శివాలెత్తిపోయింది. ఫలితంగా 26 బంతుల్లో రెండో 50 పరుగులు సాధించింది.
దీంతో 90 బంతుల్లో కెరీర్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్‌కు రెండో ఎండ్‌లో దీప్తి శర్మ (25) చిన్న ఝలక్ ఇచ్చింది. అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించడంతో హర్మన్ తృటిలో రనౌట్ నుంచి బయటపడింది. ఆవేశం ఆపుకోలేకపోయిన పంజాబ్ ప్లేయర్ హెల్మెట్‌ను నేలకేసి కొడుతూ దీప్తిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటన తర్వాత కాస్త శాంతించిన పంజాబ్ ప్లేయర్ ఆసీస్ స్పిన్ త్రయం జొనాసెన్, గార్డెనర్, బీమ్స్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లకు తెరలేపింది.
మధ్యలో కాస్త పక్కటెముకల నొప్పితో ఇబ్బందిపడ్డా అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో లాంగాఫ్, మిడ్‌వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్సర్లు బాదడంతో పరుగులు వరదలా పారాయి. దీంతో జస్ట్ 17 బంతుల్లో మరో 50 పరుగులు హర్మన్ ఖాతాలో చేరాయి. దీప్తితో నాలుగో వికెట్‌కు హర్మన్ 13.4 ఓవర్లలో 137 పరుగులు జోడించడంతో భారీ స్కోరు ఖాయమైంది. కెరీర్ మూడో సెంచరీతో పాటు ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఉమెన్ క్రికెటర్‌గా తన పేరు లిఖించుకుంది.