ఇన్నాళ్లూ వన్డేలు, టీ20లకే పరిమితమైన హార్డ్ హిట్టర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు టెస్ట్ క్రికెట్లోనూ తనదైన మార్క్ చూపించాడు. శ్రీలంకతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతను విశ్వరూపం చూపించాడు. ఆడుతున్నది టెస్ట్ మ్యాచే అయినా టీ20 స్టైల్లో చెలరేగాడు. కేవలం 86 బంతుల్లోనే టెస్టుల్లో తొలి సెంచరీ చేశాడు పాండ్యా. అందులో 7 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి.
ఈ క్రమంలో మరో అరుదైన రికార్డును అందుకున్నాడతడు. తొలి గంటలోనే మూడు వికెట్లు తీసి ఊపు మీదున్న లంక బౌలర్లకు దిమ్మదిరిగే షాకిచ్చాడు పాండ్యా. ముఖ్యంగా స్పిన్నర్ సందకన్ బౌలింగ్‌లో చెలరేగి ఆడాడు. ఒకే ఓవర్లో ఏకంగా 26 రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు పాండ్యా.
ఇన్నింగ్స్ 116వ ఓవర్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. తొలి రెండు బంతులు ఫోర్లు, ఆ తర్వాత మూడు వరుస సిక్సర్లు.. ఆరో బంతి డాట్.. ఇలా ఒకే ఓవర్లో మొత్తం 26 పరుగులు. గతంలో 24 పరగులతో కపిల్ దేవ్, సందీప్ పాటిల్ పేరు మీదున్న రికార్డును పాండ్యా అధిగమించాడు.
ఈ లిస్ట్‌లో 28 పరుగులతో బ్రియాన్ లారా పేరిట వరల్డ్ రికార్డు ఉంది. 2004లో అతను సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. ఇక ఒకే ఓవర్లో మూడు వరుస సిక్సర్లు కొట్టడం మూడు నెలల్లో పాండ్యాకిది మూడోసారి. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌పై రెండు ఓవర్లలో వరుసుగా మూడేసి సిక్సర్లు బాదాడు. ఇక ఎనిమిదో స్థానంలో ఆడుతూ అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్‌గానూ పాండ్యా నిలిచాడు.